రష్యా-ఉక్రెయిన్ లపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ ను హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు రష్యాపై పడ్డాడు. ఇంతకూ అతడి ప్లాన్ ఏమిటంటే...  

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానని ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అన్నట్లుగానే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారు. యుద్ధాన్ని ఆపడానికి వివిధ స్థాయిల్లో చర్చలు కూడా ప్రారంభించారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో జరిగిన వాగ్వాదం తర్వాత అంతా మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది.

అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు రష్యాను హెచ్చరించారు. రష్యా వెంటనే కాల్పుల విరమణ చేయకపోతే భారీ ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరిస్తోంది.

రష్యా వెంటనే కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం చేసుకోకపోతే రష్యాపై భారీ బ్యాంకింగ్ ఆంక్షలు, సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాను హెచ్చరించారు. ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్‌లు చర్చల టేబుల్‌పైకి రావాలని కోరారు. రష్యా ప్రస్తుతం యుద్ధరంగంలో ఉక్రెయిన్‌పై తీవ్రంగా దాడి చేస్తోంది. అందుకే తుది శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై భారీ బ్యాంకింగ్ ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నానని ట్రంప్ తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వైఖరి

ట్రంప్ ప్రకటనతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ఆయనకు విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన నేరుగా రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

రష్యాపై ఇప్పటికే అనేక దేశాల ఆంక్షలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి.2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యాపై 21,000కు పైగా ఆంక్షలు విధించాయి. ఇప్పుడు అమెరికా కూడా మరిన్ని ఆంక్షలకు సిద్దమయ్యింది.