హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్!

Trump Warns Harley-Davidson; Says Not To Leave The Country
Highlights

అమెరికాలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ అయిన హ్యార్లీ డేవిడ్‌సన్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

అమెరికాలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ అయిన హ్యార్లీ డేవిడ్‌సన్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య పన్నుల విధానం కారణంగా హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీ అమెరికా వదలి ఇతర దేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.

హార్లే డేవిడ్‌సన్‌ నూటికి నూరు శాతం అమెరికాలోనే ఉండాలని, తమ విజయానికి కారణమైన ప్రజలతోనే ఉండాలని ట్రంప్‌ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. మరొక ట్వీట్‌లో 'మేము మీకు చాలా చేశాం. మీరు మాత్రం ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మిగతా కంపెనీలు వెనక్కి వచ్చేస్తున్నాయి. మిమ్మల్ని విడిచిపెట్టం. మీ వినియోగదారులు కూడా మిమ్మల్ని మర్చిపోరు' అంటూ ట్వీట్ చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ధర అధికమైనప్పటికీ, యువతకు ఈ బ్రాండ్ అంటే ఎంతో క్రేజ్. యూరప్, ఆసియా మార్కెట్లలో విక్రయిస్తున్న హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లన్నింటినీ దాదాపుగా అమెరికాలో తయారు చేసి ఆయా మార్కెట్లలోకి దిగుమతి చేసి విక్రయిస్తుంటారు.

తాజాగా ఎగుమతి, దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుకు ధీటుగా పలు దేశాలు స్పందిస్తున్న నేపథ్యంలో పెద్ద వాణిజ్య యుద్ధమే జరుగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అమెరికన్ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ ఆ దేశాన్ని వదలి యూరప్ దేశాల్లో మకాం పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇందుకు ప్రధాన కారణం.. యూరప్ మార్కెట్ల నుంచి దిగమతి చేసుకునే వాహనాలపై భారీ సుంకాన్ని విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ దేశాలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై సుంకాన్ని పెంచేస్తున్నామని ప్రకటించాయి. హ్యార్లీ డేవిడ్‌సన్‌కు యూరప్, ఆసియాలు అతిపెద్ద మార్కెట్లు, ఇలా సుంకాలు పెంచుకుంటూ పోతే హ్యార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలు తగ్గి, ఆదాయాలు తగ్గిపోతాయి.

ఈ నేపథ్యంలో ఐరోపా మార్కెట్లకు ఎగుమతి చేసే మోటార్‌సైకిళ్లను భారత్‌, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా దేశాల్లో తయారు చేయాలని హ్యార్లీ డేవిడ్‌సన్ భావిస్తోంది. మరి ఈ అమెరికన్ కంపెనీ బై అమెరికన్ హైర్ అమెరికన్ నినాదాన్ని పాటిస్తూ అదే దేశంలో కొనసాగుతుందో లేక లాభార్జన కోసం ట్రంప్ ఆంక్షలు ధిక్కరించి ఇతర దేశాలకు తరలి వెళ్తుందో వేచి చూడాలి.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader