ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏకంగా రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరాక్ , ఇరాన్  కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ అధినేత ఖాసీం సోలేమన్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు.అయితే... ఈ ఘటన మొత్తానికి కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని తెలిసింది. ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని.. పెంటగాన్ ప్రకటించింది.

‘‘ ఇరాక్ లోని అమెరికా దౌత్యవేత్తలు, అమెరికా సేవా సభ్యులను అంతమొందించేందుకు  ఖాసీం సోలేమాన్ పథకాలు రచిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. వందల మంది అమెరికన్లు , సంకీర్ణ సేవా సభ్యులు ప్రాణాలు పోవడానికి, చాలా మంది గాయాలపాలవ్వడానికి సోలేమాన్, అతని మద్దతు దారులే కారణం’ అని అమెరికా రక్షణ శాఖ వివరించింది. 

కాగా... శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ ఎయిర్ పై దాడి జరిగింది. ఇదిలా ఉంటే... ఇరాన్ అధ్యక్షుడు అయతోల్లా అలీ ఖమేనీ తర్వాత ఖాసీం సులేమాన్ అత్యంత శక్తివంతమైన నేత. ఇరాక్ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలు, దౌత్య సంబంధాలు, తదితర అంశాలలో ఈయనే కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ రాకెట్ దాడిలో ఇరాక్ పాపులర్ మొబిలైజేషన్ యూనిట్ డిప్యూటీ అధికారి, ఇరాన్ ఐబీ చీఫ్ సులేమాన్‌కు సన్నిహితుడైన ముహదీస్ అబు మహదీ అల్ ముహదస్ సైతం మృతిచెందినట్టు భావిస్తున్నారు.

రెండు రోజుల కిందట ఇరాన్ మద్దతుదారులు ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వెంటనే అక్కడకు అదనపు బలగాల్ని పంపారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.