ఖతార్‌ ఇచ్చే విమానం గురించి అడిగిన విలేకరిపై ట్రంప్‌ మండిపడ్డారు. అమెరికా రక్షణశాఖ ఈ జంబో జెట్‌ స్వీకారానికి అంగీకరించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నకు ఖతార్‌ పాలకులు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని గురించి అడిగిన ఓ విలేకరి పై ట్రంప్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. విలేకరిగా విధులు నిర్వహించడానికి నువ్వు అసలు అర్హుడివే కాదంటూ మండిపడ్డారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ట్రంప్‌ భేటీ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అనూహ్య సంఘటన జరిగింది.అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌...ఇక్కడి నుంచి ముందు పో..ఇక్కడ మేం సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నదానికి, ఖతార్‌ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అయితే, దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావా..?

నువ్వు తెలివితక్కువ వాడివి…

నువ్వు తెలివితక్కువ వాడివి. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందన్నారు. ట్రంప్‌ కొంతకాలం క్రితం మధ్యప్రాచ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందే విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ఖతార్‌ పాలకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీన్ని స్వీకరించేందుకు ట్రంప్ కూడా రెడీ అయ్యారు. దీనికి అధ్యక్ష విమానానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ విమానం ట్రంప్‌ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదించింది. అధ్యక్షుడి సురక్షిత వినియోగానికి అనుగుణంగా విమానంలో తగిన భద్రతాపరమైన మార్పుల కోసం తమ శాఖ కసరత్తు చేస్తోందని పెంటగాన్‌ ప్రతినిధి సీన్‌పార్నెట్‌ తెలిపారు.