భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా ఉంటున్నారని తెలిసి ఆయనకు పెళ్లి సంబంధాలు చూడడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చారు. మోదీ ఒప్పుకుంటే అతడికి మంచి సంబంధం చూస్తానని ఆ వ్యక్తి అధికారులతో అన్నారట. ఇలా మోదీకి పెళ్లిసంబంధాలు చూస్తానంటున్న అతడు అల్లా టప్పా వ్యక్తి కాదు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ
విషయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ‘పొలిటికో’ప్రచురించింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఓ ప్రత్యేక కథనాన్ని ఈ పత్రిక ప్రచురించింది. వివిధ సందర్భాల్లో ట్రంప్ మాటలను, చలోక్తులను, టెలిఫోన్ సంభాషణలను క్రోడీకరించి ఆసక్తికర కథనాన్ని రూపోందించింది. ఇందులోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇలా పెళ్లి చూపుల ప్రపోజల్ ను తీసుకువచ్చినట్లు ఈ పత్రిక తెలిపింది.

గత సంవత్సరం జూన్ లో ప్రధాని అమెరికా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ వైట్ హౌస్ అధికారుల ద్వారా మోదీ తన భార్యతో కలిసి ఉండటం లేదని తెలుసుకున్నారట.  దీంతో మళ్లీ పెళ్లిచేసుకుంటానంటే మోదీకి సంబంధం చూడటానికి తాను సిద్దంగా ఉన్నట్లు అధికారులతో తెలిపారట. ఇదే విషయాన్ని పొలిటికో  ప్రచురించింది.