అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే చైనా,కెనడా వంటి దేశాలకు ప్రతీకార సుంకాలు విధిస్తామన్న ఆయన ఇప్పుడు ఆ జాబితాలోకి ఇండియాను చేర్చారు. 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినతర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అలజడి రేగింది. ఇతర దేశాల వస్తుసేవలపై భారీగా సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చైనా, మెక్సికో, కెనడా తో పాటు యూరప్ దేశాలకు టారీఫ్స్ పెంచుతామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఇండియాపై పడ్డారు. వచ్చేనెల ఏప్రిల్ 2 నుండి చైనా,కెనడా తో పాటు ఇండియాపై పన్నులు పెంచుతామని ప్రకటించారు. ఇండియా తమ వస్తుసేవలపై 100 శాతం పన్ను విధిస్తోంది... ఇక తాముకూడా అలాగే పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేసారు. 

ట్రంప్ పన్నుల పెంపు నిర్ణయం ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది : 

ఇండియా నుండి అమెరికాతో పాటు అనేక దేశాలకు మెడికల్, ఐటీ సర్వీసెస్ ఎక్కువగా ఎగుమతి అవుతాయి. కాబట్టి ఏప్రిల్ 2 నుండి మెడిసిన్స్, మెడికల్ డివైజెస్, వ్యవసాయ ఉత్పత్తులు, వాహనాలను అమెరికాకు ఎగుమతిచేస్తే భారీగా సుంకాలు పడతాయన్నమాట. దీంతో భారత ఫార్మా, టెక్స్ టైల్, ఐటీ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థను కూడా ట్రంప్ నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నారు. అధిక సుంకాల కారణంగా భారత వాణిజ్యరంగం ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదముంది. దీంతో ఇప్పటివరకు దూసుకుపోయిన దేశ ఆర్థికవ్యవస్థ కాస్త మందగించే అవకాశాలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఈ టారీఫ్స్ పెంపు నిర్ణయంతో 0.5-0.6 శాతం ప్రభావితం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశం అమెరికా మిషనరీస్ పై 7 శాతం, పాదరక్షలు, రవాణా సామాగ్రిపై 15-20 శాతం, అహార వస్తువులపై 68 శాతం పన్ను విధిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా కేవలం 5 శాతం పన్నులు విధిస్తుంటే... భారత్ మాత్రం 39 శాతం విధిస్తోంది. అమెరికాకు ఎగుమతి అయ్యే ఇండియా వాహనాలపై కేవలం 2.4 శాతం పన్ను విధిస్తుంటే... ఇండియా మాత్రం అమెరికా నుండి వచ్చే వాహనాలపై 100 శాతం పన్నులు వసూలు చేస్తొంది.

ఇలా తాము తక్కువగా పన్నులు వసూలు చేస్తుంటే ఇండియా మాత్రం అధిక పన్నులు వసూలు చేస్తోందన్పది ట్రంప్ వాదన. అందువల్లే తాముకూడా ఇక ఇండియా వస్తుసేవలపై పన్నుల మోత మోగిస్తామని ట్రంప్ అంటున్నారు. 

అసలు ఏమిటీ ప్రతికార సుంకాలు : 

మనతో ఇతరులు ఎలా ఉంటారో మనంకూడా వారితో అలాగే ఉండాలని అనుకుంటాం. గౌరవిస్తే తిరిగి గౌరవిస్తాం, అవమానిస్తే తిరిగి అవమానిస్తాం. మనసు నొప్పించడం,బాధపెట్టడం చేస్తే ప్రతీకారంతో రగిలిపోతాం. అయితే మనుషుల మధ్యనే కాదు దేశాల మధ్య కూడా ప్రతీకారం ఉంటుంది. తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార సుంకాలు అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. 

అసలు ఈ ప్రతీకార సుంకం అంటే ఏంటంటే... ఒక దేశం తమ వస్తువలపై ఏ దేశం ఎంత పన్ను విధిస్తుందో అదే స్థాయిలో పన్నులను ఆ దేశ వస్తువులపై విధించడమే ప్రతీకార పన్ను. ఉదాహరణకు భారత్ ఎలాగైతే అమెరికా వస్తువులపై పన్నులు విధిస్తుందో సేమ్ అమెరికా కూడా భారత వస్తువలపై అదేస్థాయిలో పన్నులు విధిస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేలా విధించే పన్నుల విధానాన్నే ప్రతీకారం సుంకం అంటారు.