పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. దక్షిణ పంజాబ్‌ సాదిఖాబాద్‌లోని వాల్హర్ రైల్వేస్టేషన్‌లో అక్బర్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చే సిగ్నల్‌లో పొరపాటు జరగడంతో అది గూడ్స్ రైలు నిలిపివుంచిన లూప్‌లైన్‌లోకి ప్రవేశించి దానిని వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 85 మంది తీవ్రగాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ఆధునాతన యంత్ర సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.