Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ లో విషాదం.. మంచులో చిక్కుకొని 22 మంది మృతి

పాకిస్తాన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పర్యాటకప్రాంతమైన ముర్రేలో విపరీతంగా కురిసిన మంచు చిక్కుకొని  22 మంది చనిపోయారు. ఇందులో 9 మంది పిల్లలు ఉన్నారు. 

Tragedy strikes Pakistan, 22 killed in snowstorm
Author
Pakistan, First Published Jan 9, 2022, 9:55 AM IST

పాకిస్తాన్ లో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులోని ప‌ర్యాట‌క ప్రాంత‌మైన ముర్రేలో విపరీత‌మైన మంచు కుర‌వ‌డం వ‌ల్ల కార్ల‌లో చిక్కుకొని 22 మంది మృతి చెందారు. ఇందులో తొమ్మిది మంది పిల్ల‌లు ఉన్నారు. శ‌నివారం రాత్రి నుంచి ఈ ప్రాంతంలో మంచు విప‌రీతంగా కురుస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్ర‌భుత్వం విప‌త్తు ప్ర‌భావిత ప్రాంతంగా ప్ర‌క‌టించింది. 

రావల్పిండి జిల్లాలోని ముర్రేలో ఈ స‌మ‌యంలో మంచు కురుస్తూ ఉంటుంది. దీంతో ప‌ర్యాట‌క‌లు అధిక సంఖ్య‌లో వ‌చ్చి ఈ సుంద‌ర దృశ్యాల‌ను వీక్షిస్తుంటారు. ఒక్క సారిగా పెద్ద మొత్తంలో మొత్తం కుర‌వ‌డం వ‌ల్ల వాహ‌నాల్లో ఉన్న వారంతా చిక్కుకుపోయారు. కార్ల‌పై ద‌ట్టంగా మంచు పేరుకుపోయింది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్ర‌త‌లు -8 డిగ్రీల‌కు ప‌డిపోయాయి. కార్లు ఎటూ క‌ద‌లేని ప‌రిస్థితుల్లో ఉండిపోయాయి. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలోకి వేలాది వాహనాలు నగరంలోకి ప్రవేశించడంతో అన్ని మార్గాలను బ్లాక్ చేశారు. పర్యాటకులు రోడ్లపై నిస్సహాయంగా ఉండిపోయారు.

దాదాపు  1,000 కార్లు హిల్ స్టేషన్‌లో చిక్కుకున్నాయి. ప‌ర్యాట‌కుల‌కు స‌హాయం అందించ‌డానికి, రెస్క్యూ ప‌నల‌ను వేగ‌వంతం చేయ‌డానికి పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ ఆదేశాలు జారీ చేశార‌ని ‘డాన్’ వార్తాపత్రిక నివేదించింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో పంజాబ్ ప్రభుత్వం హస్పిట‌ల్స్‌, పోలీసు స్టేషన్స్, ప‌రిపాల‌నా కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది.

ఈ ఘ‌ట‌న‌పై పాక్ ఇంట‌ర్న‌ల్ ఎఫైర్స్ మినిస్ట‌ర్ షేక్ ర‌షీద్ స్పందించారు. ముర్రే ఘటనపై ప్రభుత్వం విచాణకు ఆదేశించింద‌ని తెలిపారు. మంచులో చిక్కుకున్న వారికి సహాయం అందిచేందుకు యంత్రాంగం పని చేస్తోంద‌ని అన్నారు.  రోడ్లను క్లియర్ చేయడానికి, మంచులో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సైన్యాన్ని సమీకరించినట్టు తెలిపారు. మంచు కార‌ణంగా ఇస్లామాబాద్ నుంచి ముర్రే వరకు ఉన్న రహదారిని ప్రభుత్వం మూసివేయవలసి వచ్చిందని ఆయ‌న చెప్పారు. ఇస్లామాబాద్, రావల్పిండి కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. శ‌నివారం రాత్రి నుంచి ఈ ప్రాంతంలో దాదాపు 1,000 వాహనాలు నిలిచిపోయాయ‌ని, వాటిలో కొన్నింటిని సుర‌క్షితంగా తీసుకొచ్చామ‌ని అన్నారు. ఒంటరిగా ఉన్న వారికి స్థానికులు ఆహారం, దుప్పట్లు అందించారని తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ముర్రే ప్రాంతానికి వెళ్లే రోడ్ల‌న్నీ మూసివేసి ఉంటాయ‌ని ఆయన ట్వీట్ చేశారు.

అయితే జనవరి 6 నుంచి 9 వరకు ముర్రే, గలియత్‌లలో భారీగా మంచు కురుస్తుంద‌ని పాకిస్తాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి నుంచి మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లోని రోడ్లపైనే చిక్కుకుపోయారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసు అధికారులు రోడ్లపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ  ఘ‌ట‌న‌పై విప‌క్షాలు ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తున్నాయి. వాతావ‌ర‌ణం ప్ర‌తికూలంగా ఉంటుంద‌ని ప‌ర్యాట‌కుల‌ను ప్ర‌భుత్వం ముందే హెచ్చ‌రించి ఉండాల్సింద‌ని విమ‌ర్శించాయి. ప‌ర్యాట‌కులకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు క‌ల్పించ‌లేద‌ని ఆరోపించాయి. ఈ విషాదం వ‌ల్ల గుండెను క‌లిచివేసిందని, ఈ మ‌ర‌ణాల‌కు ఎవ‌రు బాధ్యుల‌ని ప్రతిపక్ష నాయకుడు, పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ప్ర‌శ్నించారు. మ‌ర‌ణాలు హృద‌య విదార‌క‌ర‌మ‌ని, గలియాత్ మార్గాలలో సంభ‌వించే విప‌త్తుల గురించి ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పీపీపీ వైస్ ప్రెసిడెంట్ షెర్రీ రెహ్మాన్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios