బెర్ముడా ట్రయంగిల్ అనే మాట వినిపిస్తేనే ఒక రకమైన భయం ఆవహిస్తుంది. ఏకంగా అలాంటి ప్రదేశానికి టూర్ వేయడానికి ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్లాన్స్ సిద్ధం చేసింది. వచ్చే మార్చిలో ఈ టూర్ మొదలవుతుంది. అయితే, ఈ టూర్ కోసం ఆ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ టూర్‌కు వెళ్లి తిరిగి రాకపోతే.. డబ్బులు రిఫండ్ ఇస్తామని ప్రకటించడం గందరగోళపరుస్తున్నది.
న్యూఢిల్లీ: బెర్ముడా ట్రయంగిల్ మిస్టరీపై ఎడతెగని చర్చ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ట్రయంగిల్ గుండా వెళ్లిన షిప్‌లు, విమానాలు మళ్లీ తిరిగి వెనక్కి రాలేదు. దీంతో ఈ ట్రయంగిల్ ఏరియాపై ఎన్నో రకాల వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికీ ఈ అంశంపై ఇదమిద్దమైన స్టేట్‌మెంట్ లేదు. అందుకే ఈ బెర్ముడా ట్రయంగిల్ గురించి ప్రస్తావన రాగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. తాజాగా, ఈ బెర్ముడా ట్రయంగిల్ గురించిన ప్రకటన ఒకటి వచ్చింది. ఓ ట్రావెల్ ఏజెన్సీ ఈ ప్రకటన చేసింది. వారు ఏకంగా బెర్ముడా ట్రయంగిల్‌కే టూర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ టూర్‌లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారికి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. అయితే, ఆ ఆఫర్ విచిత్రంగా ఉండటంతో బెర్ముడా ట్రయంగిల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఏన్షియంట్ మిస్టరీస్ క్రూజ్ అనే ట్రావెల్ ఏజెన్సీ దాని వెబ్‌సైట్‌లో ఈ విచిత్ర ఆఫర్ ప్రకటించి ఉన్నది. బెర్ముడా ట్రయంగిల్ టూర్‌లో మిస్ అయిపోతారనే భయం వద్దు అని భరోసానిస్తూ ఓ లైన్ ఉన్నది. ఈ టూర్ విజయవంతమై తిరిగి రావడానికి 100 శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, ఒక వేళ టూర్ పోయినవారు తిరిగి రాకుంటే డబ్బులు రిఫండ్ చేస్తామనే ప్రకటన మాత్రం అందరినీ ఆలోచనలో పడేసింది.
ఈ టూర్ వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుంచి బెర్ముడాకు ట్రిప్ ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. గ్లాస్ బాటమ్ బోట్ ద్వారా ఆ బెర్ముడా ట్రయంగిల్‌లో ప్రతీది గమనించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ట్రిప్ కోసం 1,450 పౌండ్లు ఒక క్యాబిన్ కోసం చెల్లించాల్సి ఉన్నది.
అట్లాంటిక్ మహాసముద్రంలో మూడు బిందువులను కలుపుతూ ఊహాజనిత రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయంగిల్ అనొచ్చు. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే బెర్ముడా దేశం, పోర్టోరికో, మయామీ ప్రాంతాల మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాన్నే బెర్ముడా ట్రయంగిల్ అంటారు. ఇది సుమారు ఐదు లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం ఉంటుంది. దీని చుట్టూ ఉన్న మిస్టరీ ఏమిటంటే.. ఈ ట్రయంగిల్ గుండా వెళ్లిన పడవలు, ఓడలు మళ్లీ భూమిపై అడుగుపెట్టలేవని, నాశనం అయిపోయాయని చెబుతారు. కేవలం ఆ ట్రయంగిల్ ప్రాంతంలోని సముద్రంపై ఈదుతూ వెళ్లిన ఓడలే కాదు.. ఆ ప్రాంతంపై ఎగురుతూ అంటే ఆ కాశంలో వెళ్లిన విమానాలు కూడా మళ్లీ వెనక్కి రావనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా సైంటిస్టు విషయానికి వస్తే.. సిడ్నీ యూనివర్సిటీ కారల్ క్రూస్జెనికీ ఈ మిస్టరీని సాల్వ్ చేసినట్టు ప్రకటించారు. ఈ మిస్టరీ వెనుక ఎలాంటి అతీత శక్తులు లేదా ఏలియన్లు లేవని స్పష్టం చేశారు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాల శాతం తీస్తే.. భూగ్రహంపై ఉన్న ఇతర సముద్ర జలాల్లో జరిగే ప్రమాదాల శాతం తీస్తే అసాధారణంగా ఏమీ లేదని లెక్కగట్టారు. ఇందుకోసం ఆయన లండన్‌కు చెందిన లాయిడ్స్, అమెరికా కోస్ట్‌గార్డు లెక్కలను ఆధారంగా తీసుకున్నారు. శాతాల వారీగా చూస్తే ఇతర సముద్ర జలాల్లో అదృశ్యం అవుతున్న ఘటనలు సంఖ్య కూడా బెర్ముడా ట్రయంగిల్‌లో అదృశ్యమైన సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. బెర్ముడా ట్రయంగిల్‌లో జరిగే ఘటనలకు మానవ తప్పిదాలే కారణంగా ఉండొచ్చని వివరించారు.
