heavy rains: పాకిస్థాన్ లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. బలూచిస్తాన్ లోని ఏడు డ్యాములు కూలిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పొటెత్తి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 127కు పెరిగింది.
heavy rains in Pakistan: పాకిస్థాన్‌లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదల పొటెత్తిత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్ లో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రావిన్స్‌లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించిన తరువాత, బలూచిస్తాన్‌లో కనీసం ఏడు ఆనకట్టలు వరద తాకిడిని తట్టుకోలేక కూలిపోయాయి. భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 127 కు చేరుకుందని మీడియా నివేదికలు తెలిపాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వేలాది ఇళ్లు ధ్వంసమవడంతో బాధితులు బహిరంగ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని ARY న్యూస్ నివేదించింది. ఇదిలా ఉండగా, బలూచిస్థాన్‌లో వర్షాల కారణంగా 7 డ్యామ్‌లు తెగిపోయాయని, చాలా డ్యామ్‌లు నీటితో నిండిపోయాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (పిడిఎంఎ) తెలిపింది. ఇప్పటికీ అనేక ప్రాంతాలు నీటమునిగి ఉన్నాయి. అనేక నగరాలతో కమ్యూనికేషన్ నిలిపివేయబడింది.
టర్బత్‌లోని మీరాణి డ్యామ్ పొంగిపొర్లుతోంది. దీని కారణంగా స్పిల్‌వేలు (డ్యామ్ నుండి మిగులు జలాల కోసం మార్గం) తెరవబడి నీటి ప్రవాహం కొనసాగుతోంది. మీరాని డ్యామ్ గరిష్ట స్థాయి 244 అడుగులు.. కాగా, ప్రమాదకరస్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. హబ్ డ్యాంలో నీటిమట్టం 339 అడుగులు కాగా స్పిల్‌వే పరిమితి 350 అడుగులు, షాదీ కోర్ డ్యామ్ గ్వాదర్‌లో అత్యధిక నీటిమట్టం 54 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 51.34 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. గుడ్డు బ్యారేజీ వద్ద 24 గంటల్లో 20 వేల క్యూసెక్కుల నీటిమట్టం పెరిగిందని, తర్బేల, చష్మా, తౌన్సా, గుడ్డు, సుక్కూర్ బ్యారేజీల్లో వరద ప్రస్తుతం తక్కువగా ఉందని సమాచారం.
బలూచిస్థాన్‌లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు కొనసాగుతున్నందున.. రెండవ వరద ప్రవాహం ప్రక్కనే ఉన్న కంబర్-షహదాద్‌కోట్ జిల్లా, దాదు జిల్లాలోని కచో కొండ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్దమొత్తంలో నష్టం సంభవించింది. "కచ్చోలోని మరో ముప్పై గ్రామాలు, లింక్ రోడ్లు నీటిలో మునిగిపోయాయి. కొండ ప్రాంతంలో మునిగిపోయిన గ్రామాల మొత్తం 50 కి చేరుకున్నాయి" అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బాధిత ప్రాంతాల ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొండలు, రక్షిత వాగులను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానిక వర్గాలు తెలిపాయి. వరద బాధిత గ్రామాల్లో వైద్య సేవలు అందక రోగులు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. బలూచిస్థాన్‌లో భారీ వర్షాలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో అధికారులు ప్రావిన్స్‌లో 144 సెక్షన్ విధించారు.
ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీజ్ ఉకైలీ మాట్లాడుతూ "ప్రావిన్స్‌లో సెక్షన్ 144 అమలు చేయబడిందని తెలిపారు. పౌరులు 10 రోజుల పాటు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని" సూచించారు. జూన్ 1 నుండి ఇప్పటివరకు భారీ వర్షాలు 124 మంది ప్రాణాలను బలిగొన్నాయని, ప్రావిన్స్‌లో 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. వరదల కారణంగా సుమారు 565 కి.మీ రోడ్లు, 197,930 ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నది. 712 పశువులు కూడా చనిపోయాయి”అని ఉకైలీ తెలిపారు.
