Asianet News TeluguAsianet News Telugu

నేడు పాక్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న షెహబాజ్ షరీఫ్.. ఎందుకంటే ?

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రభుత్వాన్ని ముందస్తుగా రద్దు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధనపు సమయం కావాలనే ఉద్దేశంతో ఆయన వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Today Shehbaz Sharif will resign from the post of Prime Minister of Pakistan.. because?..ISR
Author
First Published Aug 9, 2023, 8:51 AM IST

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేడు (బుధవారం) రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అదనపు సమయం కోసం ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంటోంది. దీంతో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని నేడు ముందస్తుగా రద్దు కానుంది.

వాస్తవానికి పార్లమెంటు దిగువ సభ ఐదేళ్ల పదవీకాలం ఆగస్టు 12న ముగియనుంది. కానీ దానికి నాలుగు రోజులు ముందుగానే నేడు (ఆగస్టు 9)న ప్రధాని షరీఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారు. ఒకవేళ రాష్ట్రపతి దానికి ఆమోదం తెలిపితే 48 గంటల్లోగా అసెంబ్లీని రద్దు అవుతుంది. కాగా.. నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి నుంచి వైదొలుగుతారన్న సంకేతాలతో రావల్పిండిలోని పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ కు వీడ్కోలు పలికారు. ప్రధాని షరీఫ్ మంగళవారం జనరల్ హెడ్ క్వార్టర్స్ (జిహెచ్క్యూ)కు వీడ్కోలు పలికారని, ఇది ప్రభుత్వాధినేతగా తన పదవీకాలంలో ఒక ముఖ్యమైన ఘట్టమని ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ వార్తాపత్రిక తెలిపింది.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మరో రెండు రోజులు అధికారంలో ఉండి ఆగస్టు 11 న పార్లమెంటును రద్దు చేయాలని ముందుగా అనుకుంది. కానీ ప్రధాని రాజీనామా చేసిన వెంటనే దానికి రాష్ట్రపతి అల్వీ ఆమోద ముద్ర వేసి, వెంటనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారని ‘జీ న్యూస్’ నివేదించింది. 

వాస్తవానికి అసెంబ్లీ రాజ్యాంగ కాలపరిమితి పూర్తయితే 60 రోజుల్లోగా ఈసీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొత్త జనాభా గణనను సమాఖ్య యూనిట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి నియమించిన రాజ్యాంగ సంస్థ కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఆమోదించినందున ఎన్నికలకు 90 రోజులు కూడా సరిపోకపోవచ్చు. దాని ఆమోదం తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపీపై ఉంది. 

ఇదిలావుండగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా అన్నారు. మంగళవారం ‘జియో న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ 2023 ఎన్నికల సంవత్సరం కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం 2017 జనాభా లెక్కల ఫలితాలను ఒకేసారి తాత్కాలికంగా ఆమోదించినందున మరో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించలేమని పునరుద్ఘాటించారు.

కాగా.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఆపద్ధర్మ ప్రధాని పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం, మిత్రపక్షాలు మాత్రం అభ్యర్థి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. నేటి సాయంత్రం వరకు అభ్యర్థి ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరి పేరును ప్రతిపాదించకపోతే రాజ్యాంగబద్ధంగా ప్రస్తుత ప్రధాని కేర్ టేకర్ గా కొనసాగుతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios