Asianet News TeluguAsianet News Telugu

దలైలామా వారసుడి ఎంపిక: అమెరికా బిల్లును స్వాగతించిన టిబెటన్ నేత

ఆధ్యాత్మిక  గురువు ద‌లైలామా వార‌సుడిని ఎంచుకునే హ‌క్కు టిబెటన్ల‌కే క‌ల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. ద టిబెట‌న్ పాల‌సీ అండ్ స‌పోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ)  ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. 

Tibetan leader welcomes US bill that reaffirms rights, angering China
Author
Dharamshala, First Published Dec 23, 2020, 9:24 PM IST

ఆధ్యాత్మిక  గురువు ద‌లైలామా వార‌సుడిని ఎంచుకునే హ‌క్కు టిబెటన్ల‌కే క‌ల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. ద టిబెట‌న్ పాల‌సీ అండ్ స‌పోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ)  ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే  సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది

దలైలామాను చైనా ఒక ప్రమాదకరమైన వేర్పాటువాదిగా భావిస్తోంది. అమెరికా కాంగ్రెస్ నుంచి తాజా మద్ధతు రెండు అగ్రరాజ్యాల మధ్య ఇప్పటికే వున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం వుంది.

అజ్ఞాతంలోని టిబెటన్ ప్రభుత్వంగా భావిస్తున్న టిబెటన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ (సీటీఏ) అధ్యక్షుడు లోబ్సాంగ్ సంగే రాయిటర్స్ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ద టిబెట‌న్ పాల‌సీ అండ్ స‌పోర్ట్ యాక్ట్ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. 

ఈ నిర్ణ‌యం ప్ర‌స్తుత ద‌లైలామా, టిబెట‌న్ బుద్ధిస్ట్ లీడ‌ర్లు, టిబెట్ ప్ర‌జ‌లదే అని టీపీఎస్ఏ స్ప‌ష్టం చేస్తోంద‌ని సెంట్ర‌ల్ టిబెట‌న్ అడ్మినిస్ట్రేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇప్ప‌టికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ వ్య‌వ‌హారంలో చైనా ప్ర‌భుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్ర‌మైన ఆంక్ష‌లు ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని కూడా హెచ్చ‌రించింది. 

దీనిపై స్పందించిన చైనా   అమెరికాపై మండిప‌డుతోంది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీని ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించింది.

ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్‌లోని ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై సంత‌కం చేయ‌కూడ‌ద‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.

1950లో సైనిక దళాలు "శాంతియుత విముక్తి" అని పిలిచే ప్రాంతంలో ప్రవేశించిన తరువాత చైనా టిబెట్ నియంత్రణను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి టిబెట్ ... చైనాలో అత్యంత సున్నితమైన ప్రాంతాలలో ఒకటిగా మారింది. చైనా పాలనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు విఫలమవ్వడంతో దలైలామా 1959లో భారతదేశానికి పారిపోయారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్‌ చేరుకున్న ఆయనతో పాటు వేలాది మంది టిబెటన్లు వచ్చారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే టిబెటన్ ప్రవాస ప్రభుత్వం నడుస్తోంది. మన దేశంలో 80 వేల మందికి పైగా టిబెటన్లు ప్రవాస జీవితం గడుపుతున్నారు.

టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యు.ఎస్. కాన్సులేట్ ఏర్పాటు చేయాలని అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన చట్టం చెబుతోంది. దలైలామాకు వారసుడిని ఎన్నుకోవటానికి టిబెట్‌కు సంపూర్ణ హక్కు వుందని తెలిపింది.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇప్పటికే సంవత్సరానికి బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించే కార్యక్రమాలను పూర్తి చేసింది. అలాగే టిబెటన్ పీఠభూమి నుండి ఎక్కువ నీటిని మళ్లించడానికి ప్రణాళికలు రూపొందించిందని అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లు స్పష్టం చేసింది.

అయితే పర్యావరణ వేత్తలు, టిబెటన్ హక్కుల కార్యకర్తలు ఈ ప్రాంతంలోని చైనా జలవిద్యుత్ కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అవి దిగువ నీటి సరఫరాను ప్రభావితం చేస్తాయని చెప్పారు.

అయితే దలైలామా వారసుడిని ఆమోదించే హక్కు తమ నాయకులకు ఉందని చైనా తెలిపింది. అయితే టిబెట్‌ను నియంత్రించే బలవంతపు ప్రయత్నంగా చాలామంది దీనిని చూస్తున్నారు. అమెరికా చట్టం టిబెటన్ స్వాతంత్ర సంగ్రామానికి లభించిన విజయంగా సంగే వ్యాఖ్యానించారు. 

అమెరికా.. తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని చైనా ఆరోపిస్తోంది. వాణిజ్యం, తైవాన్, మానవ హక్కులు, హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రం, కరోనా వైరస్ వంటి పలు అంశాలపై చైనా - అమెరికా మధ్య సంబంధాలు దశాబ్దాలుగా క్షీణిస్తూ వస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios