ఇస్లామాబాద్: భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదలకు తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్తాన్ చెప్పింది. శాంతి కోసమే తాము అభినందన్ ను  విడుదల చేశామని  ఆ దేశం ప్రకటించింది.

పాకిస్తాన్ కు చెందిన ప్రతిపక్ష నేత ఆయాజ్ సాధిఖ్ అభినందన్ విడుదలకు దారితీసిన పరిస్థితులపై చేసిన వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్ ఈ విషయమై వివరణ ఇచ్చింది.

also read:పాక్ సైనిక విభాగాన్ని నాశనం చేయాలనుకొన్నాం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ధనోవా

పాకిస్తాన్ విదేశాంగ శాఖ గురువారం నాడు ఈ విషయమై స్పందించింది.2019 ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్తాన్ కు చెందిన విమానాన్ని ఇండియా వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 విమానంతో వెంటాడి కూల్చివేశాడు. ఆ తర్వాత మిగ్ కూడ కూలిపోయింది.చివరి నిమిషంలో ఆయన విమానం నుండి బయటపడ్డాడు.

మార్చి 1వ తేదీన అభినందన్ ను పాకిస్తాన్ విడుదల చేసింది. ఆయాజ్ సాధిఖ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి జాహిద్ హపీజ్ చౌదరి గురువారం నాడు స్పందించారు. అభినందన్ విడుదలలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.

శాంతి సంకేతంగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందన్నారు. తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం కూడ ప్రశంసించిందని ఆయన చెప్పారు.ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పై  ఆయన మాట్లాడారు. గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ , మనీలాండరింగ్ టెక్నికల్ ప్రక్రియను భారత్ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.