న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైనిక విభాగాల్ని తుడిచిపెట్టాలనుకొన్నామని ఇండియన్ వైమానిక మాజీ చీఫ్ బిఎస్. ధనోవా చెప్పారు.

భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న సమయంలో పరిస్థితులను ఆయన గుర్తు చేసుకొన్నారు.

అభినందన్ ను విడిచిపెట్టకపోతే భారత్ దాడికి సిద్దంగా ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశానికి చెందిన పలు పార్టీల సమావేశంలో ప్రకటించినట్టుగా   పాక్  పీఎంఎల్ నేత  ఆయాజ్  అసెంబ్లీలో ప్రకటించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విషయమై స్పందించారు.

బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులను నిరసిస్తూ మన దేశానికి చెందిన సైనిక స్థావరాలపై పాక్ దాడి విజయవంతమైతే.... ఆ దేశానికి చెందిన సైనిక విభాగాల్ని తుడిచిపెట్టాలని భావించామన్నారు.ఈ మేరకు భారత సేనలు సన్నద్దమయ్యాయని ఆయన చెప్పారు. 

అభినందన్ తండ్రి తాను కలిసి పనిచేసిన విషయాన్ని ధనోవా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్గిల్ యుద్ద సమయంలో అహుజాను పాక్ బలగాలు బంధించి కాల్చి చంపాయన్నారు.కానీ, ఈ దఫా మాత్రం అభినందన్ తిరిగి వస్తాడని  తాను ధీమాగా ఉన్నానని చెప్పారు.

పాకిస్తాన్ పై దౌత్య, రాజకీయపరమైన ఒత్తిడితో పాటు సైనిక చర్యలు మార్గాలుగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అభినందన్ ను భారత్ కు అప్పగించడం మినహా పాకిస్తాన్ కు మరే ఇతర అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

2019 ఫిబ్రవరి 27న అభినందన్ ను పాకిస్తాన్ చేతిలో చిక్కుకొన్నాడు. అదే ఏడాది మార్చి 1వ తేదీన అభినందన్ ను పాకిస్తాన్ భారత్ కు అప్పగించింది.
పాకిస్తాన్ పై ఉన్న ఒత్తిడి కారణంగా ఆ దేశం అభినందన్ ను విడిచిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ధనోవా అభిప్రాయపడ్డారు.