భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అసవరం లేదు : భారత్-కెనడా వివాదం నేపథ్యంలో జైశంకర్
భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో భారత్ ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. కెనడాలో కొన్ని సంస్థలు, వ్యక్తులు కూర్చొని భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని తెలిపారు. కొన్నేళ్లుగా తాము కెనడాతో సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటో భారత్ ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈ అంశంపై తన వైఖరిని పునరుద్ఘాటించిన ఆయన, ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస పట్ల కెనడా అనుసరిస్తున్న వైఖరి ఒక సమస్య అని అన్నారు. తన 5 రోజుల పర్యటన సందర్భంగా శనివారం తెల్లవారుజామున 1:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వాషింగ్టన్‌కు చేరుకొని అక్కడ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. చాలా మంది నిందితులను అప్పగించాలని కెనడాను భారత్ అభ్యర్థించింది. అయితే వారి నుండి ఎలాంటి స్పందనా లేదని అన్నారు. అలాంటి వ్యక్తులు, సంస్థలు కెనడాలో కూర్చుని భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. ‘‘ కెనడా మాపై కొన్ని ఆరోపణలు చేసింది. ఇది భారత ప్రభుత్వ విధానం కాదని కూడా మేము సమాధానం ఇచ్చాము. అయినప్పటికీ వారు మాతో ఏదైనా ఖచ్చితమైన సాక్ష్యాలను పంచుకుంటే, వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.’’ అని అన్నారు.
‘‘వాస్తవమేమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా కెనడా ప్రభుత్వంతో మేము సమస్యలను ఎదుర్కొంటున్నాం. సమస్య నిజంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస అనుమతి చుట్టూ తిరుగుతుంది. మేము కొందరు నిందితులను భారత్ కు అప్పగించాలని అభ్యర్థించాం కానీ వారు స్పందించలేదు. ’’ అని ఆయన అన్నారు.
భారతదేశంలో హింస, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో స్పష్టంగా పాల్గొన్న వ్యక్తులు, సంస్థలు అవన్నీ అని జైశంకర్ అన్నారు. ‘‘ఇది రహస్యం కాదు. వారు కెనడాలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన నిజం ఏమిటంటే కెనడాలో మా దౌత్య కార్యకలాపాలు, దౌత్య సిబ్బంది నిరంతరం బెదిరింపులకు గురవుతున్నారు. అందుకే మా వీసా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాం.’’ అని తెలిపారు.
సిక్కు కమ్యూనిటీకి సంబంధించి జరుగుతున్న చర్చలపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో, సిక్కు సమాజం సమస్యలు, సూచనలపై మోడీ ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిందని అన్నారు. ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఇప్పుడు చర్చిస్తున్న అంశాలు మొత్తం సమాజానికి (సిక్కులు) ప్రాతినిధ్యం వహిస్తాయని తాను నమ్మడం లేదని అన్నారు. మరో ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ కెనడాలో జరుగుతున్నది మరే దేశంలోనైనా జరిగితే ప్రపంచం ప్రతిస్పందన ఎలా ఉంటుందని అన్నారు. కెనడాలో ఏం జరుగుతోందని, మరెక్కడైనా అది జరిగి ఉంటే ప్రపంచం తేలిగ్గా తీసుకుంటుందాని అని ప్రశ్నించారు.