విడాకులపై తలెత్తిన వివాదం వల్ల ఓ మహిళ తన భర్తను తుపాకీతో కాల్చింది. దీంతో తీవ్ర గాయాలతో భర్త ఆమె నుంచి ఎలాగోలా తప్పించుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో జరిగింది.
విడాకులు వద్దని ఎన్ని సార్లు చెప్పినా భర్త వినడం లేదని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన భర్తను మంచంపై ఉండగానే కాల్చింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో చోటు చేసుకుంది. ఈ విషయం బయటకు రావడతో భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘ఎన్టీటీవీ’ కథనం ప్రకారం.. 62 ఏళ్ల క్రిస్టినా పాస్క్వెలెట్టో అనే మహిళ 80 ఏళ్ల పస్వాలే భార్యాభర్తలు. అయితే వీరిద్దరూ పలు కారణాలతో చాలా కాలంగా విడి విడిగా ఉంటున్నారు.
అయితే పస్వాలే కొంత కాలం నుంచి తన భార్యను విడాకులు కోరుతున్నాడు. కానీ దానికి ఆమె సుముఖంగా లేదు. కానీ భర్త పదే పదే విడాకులు కావాలని అడుతున్నాడు. దీంతో విసుగు చెందిన భార్య.. సెప్టెంబర్ 20వ తేదీన తను నివసిస్తున్న గిల్బర్ట్ నుంచి ప్రెస్కాట్ లో తన భర్త ఉంటున్న ఇంటికి కారులో బయలుదేరింది. ఆ ఇంట్లో భర్త ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆమె అర్థరాత్రి ఆ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య విడాకుల విషయంలో వాగ్వాదం జరిగింది.
తనకు కచ్చితంగా విడాకులు కావాలని, మనసు మార్చుకోబోనని పస్వాలే తేల్చి చెప్పడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో భర్త మంచంపై ఉండగానే కాల్చింది. దీంతో అతడి మణికట్టుకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో అతడు తన భార్యను కిందకి తోసేశాడు. ఆమె నుంచి తప్పించుకునేందుకు చేతులు, మోచేతులతో కొట్టాడు. అనంతరం పక్కింటికి చేరుకొని ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేశాడు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడిని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఫీనిక్స్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తన భార్య చెక్కులను దొంగలించిందని, వారం రోజుల క్రితం 10,000 డాలర్లకు చెక్కును ఫోర్జరీ చేసి క్యాష్ చేసుకుందని బాధితుడు పోలీసులకు వెల్లడించారు. నిందితురాలి పర్సులో భర్త చెప్పిన లావాదేవీకి సరిపోయే డిపాజిట్ స్లిప్ దొరికింది. ఆమెను విచారించడంతో ఫోర్జరీ, దొంగతనం చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను డిగ్రీ మర్డర్, దాడి, ఫోర్జరీ, దొంగతనం కేసుల కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.