మగ తోడు లేదని కారణంతో మహిళలకు విమాన ప్రయాణాన్ని నిరాకరించారు. ఈ ఘటన తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్ఘనిస్తాన్ లో జరిగింది. విమానం ఎక్కే ముందు ఈ నిబంధనను అధికారులు మహిళలకు తెలియజేశారు. దీంతో చాలా మంది ప్రయాణం నిలిచిపోయింది.
అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆరాచక పాలన కొనసాగుతోంది. మహిళ హక్కులను కాలరాస్తున్నారు. ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు. ఇటీవలే ఆడ పిల్లలను హైస్కూలు చదువుకు అనుమతిస్తామని చెప్పినా.. ఆ హామీని తుంగలో తొక్కారు. తాజాగా ప్రయాణ సమయంలో మహిళలకు తప్పనిసరిగా మగ తోడు ఉండాలని రూల్ పెట్టారు. దీంతో శనివారం చాలా మంది విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్ లో శుక్రవారం పదుల సంఖ్యలో మహిళలు ఇతర దేశాలకు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీని కోసం ముందే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో విదేశీ మహిళలు కూడా ఉన్నారు. అయితే విమానంలోకి వెళ్లే ముందు అక్కడి అధికారులు చెప్పిన రూల్ తో ఖంగుతిన్నారు. మగ తోడు లేకుండా విమానంలో ప్రయాణించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఇద్దరు ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు.
దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ఎక్కడానికి శుక్రవారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మహిళలు ఈ కొత్త రూల్ విని ఆశ్చర్యానికి లోనయ్యారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో కొంత మంది మహిళలకు వివధ దేశాలకు చెందిన మహిళలు, కెనడా దేశానికి చెందిన మహిళలు కూడా ఉన్నారు. వారి ఇళ్లకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారంతా కామ్ ఎయిర్, ప్రభుత్వ ఆధీనంలోని అరియానా ఎయిర్‌లైన్‌లో ఇస్లామాబాద్, దుబాయ్, టర్కీకి వెళ్లే విమానాల్లో ప్రయాణించాల్సి ఉంది. అయితే మగ తోడు లేకుండా విమానం ఎక్కేందుకు వీళ్లేదని అధికారులు నిరాకరించారు. తాలిబాన్ నాయకత్వం నుండి ఈ ఆదేశాలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు.
అధికారులు చెప్పిన ఈ నిబంధనలతో కొంత మంది మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వారికి పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌కు వెళ్లే అరియానా ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. కానీ అనుమతి లభించే సమయానికే విమానం వెళ్లిపోయింది. కాగా 45 మైళ్లు (72 కిలోమీటర్లు) కంటే ఎక్కువ ప్రయాణించే స్త్రీలు మగ సంరక్షుడితో కలిసి వెళ్లాలని కొన్ని నెలల క్రితం తాలిబన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయతే ఈ ఉత్తర్వు నుంచి తాలిబాన్ విమాన ప్రయాణానికి మినహాయింపు ఇస్తుందా లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. గత ఆగస్టులో తాలిబన్లు అప్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నారు. పాలనను చేతుల్లోకి తీసుకున్నారు.
తాలిబన్ల పాలనలో మహిళలకు హక్కులు పూర్తిగా తగ్గిపోతాయి. వారికి స్వేచ్ఛ ఉండదు. ఇటీవలే అఫ్ఘాన్ మహిళల చదువుల విషయంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో హైస్కూల్ చదివేందుకు వారికి అవకాశం ఇస్తామని తాలిబన్లు ప్రకటించారు. కానీ దీనిని ఇప్పటి వరకు అమలు చేయలేదు. వారి ప్రకటనను వారే ఉల్లంఘించారు. ఈ చర్య అంతర్జాతీయ సమాజానికి కోపం తెప్పించింది. దీంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. శనివారం ఆఫ్ఘన్ రాజధానిలో అధిక సంఖ్యలో బాలికలు తమకు స్కూల్ కు వెళ్లే హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు ఇచ్చారు. కాగా వేలాది మంది వాలంటీర్లతో రహస్య పాఠశాలలను నిర్వహిస్తున్న పెన్‌పాత్ అనే ఆఫ్ఘన్ స్వచ్ఛంద సంస్థ.. బాలికల విద్యను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలను నిర్వహించాలని యోచిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మతియుల్లా వెసా చెప్పారు.
