Asianet News TeluguAsianet News Telugu

థాయ్‌లాండ్ ప్రధానిపై అనర్హత వేటు.. అసలేం జరిగిందంటే?

థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెత్తా థావిసిన్‌పై అనర్హత వేటు వేసింది.

The Prime Minister of Thailand Srettha Thavisin Removed.. Constitutional Verdict GVR
Author
First Published Aug 14, 2024, 2:41 PM IST | Last Updated Aug 14, 2024, 9:33 PM IST

థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెత్తా థావిసిన్‌పై అనర్హత వేటు వేసింది. నేరారోపణలు ఉన్న వ్యక్తిని కేబినెట్‌లో నియమించడం ద్వారా నైతిక ప్రమాణాలను ఉల్లంగించారని తెలిపింది. రాజ్యాంగ ఉల్లంఘన తీర్పుతో థాయ్‌లాండ్ ప్రధాని పదవి నుంచి స్రెత్తా థావిసిన్‌ను తొలగించారు. ఈ మేరకు 5-4 ఓట్లతో తీర్పునిచ్చిన థాయ్‌లాండ్‌ రాజ్యాంగ ధర్మాసనం స్రెత్తా కేబినెట్‌లో మిగిలిన అన్ని మంత్రి పదవులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 

ప్రధాని పదవి నుంచి స్రెత్తా థావిసన్‌ను తొలగించిన నేపథ్యంలో ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి ఫుమ్థమ్ వెచయాచై తాత్కాలిక ప్రధాన మంత్రి పదవి స్వీకరించనున్నారు. కాగా, గత ఏడాది ఎన్నికలకు ముందు పార్టీలు నామినేట్ చేసిన అభ్యర్థుల్లో ఒకరిని కొత్త ప్రధానమంత్రిగా పార్లమెంటు దిగువ సభ ఎంపిక చేస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రధాని పదవి చేపట్టాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 25 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు పొందాల్సి ఉంటుంది. 

థాయ్‌లాండ్‌లో పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి మధ్య రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయంతో స్రెత్తా థావిసిన్ ప్రధాని పదవి చేపట్టిన ఏడాదిలోపే దిగిపోవాల్సి వచ్చింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన స్రెత్తా... గతంలో నేరారోపణ ఉన్న న్యాయవాది పిచిట్ చుయెన్‌బాన్‌ను తన మంత్రివర్గంలో నియమించినందుకు రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2008లో కోర్టు ధిక్కారానికి సంబంధించి చుయెన్‌బాన్ కొంతకాలం జైలు పాలయ్యారు. అయితే ఆయనపై ఉన్న లంచం, అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు రుజువు కాలేదు.

రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై స్పందించిన మాజీ ప్రధాని స్రెత్తా.. చిత్తశుద్ధితో దేశ అవసరాలకు అనుగుణంగానే తాను కేబినెట్‌ నియామకాలు చేపట్టానని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేశామని చెప్పారు.

రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు థాయ్‌లాండ్ రాజకీయ తిరుగుబాటు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. తరచూ తిరుగుబాట్లు, న్యాయపరమైన జోక్యాలు ఆ దేశ పాలనను పదేపదే అస్థిరపరిచాయి. గత వారమే ‘మూవ్ ఫార్వర్డ్ పార్టీ’ని రద్దు చేసింది.

థాయ్‌లాండ్‌ కోర్టు నిర్ణయం థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను కలిగిస్తుంది. థాయ్‌ ప్రభుత్వం 2024కి 2.7% వృద్ధి రేటును అంచనా వేసింది. ఈ ప్రభావం ఆ దేశం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా సంవత్సరానికి 17% క్షీణతలో థాయ్‌లాండ్‌ మార్కెట్లు ఉన్నాయి.

స్రెత్తా నేతృత్వంలోని ఫ్యూ థాయ్ పార్టీ సంకీర్ణంలో 314 సీట్లతో ఆధిపత్య శక్తిగా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బురాఫా యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ అండ్ లా ఫ్యాకల్టీ డిప్యూటీ డీన్ ఒలార్న్ థిన్‌బాంగ్టియో ఇలా వ్యాఖ్యానించారు... ‘ప్రభుత్వానికి ఇంకా 314 సీట్లు ఉంటాయి. సంకీర్ణం ఐక్యంగానే ఉంది. విశ్వాసంపై కొంత ప్రభావం ఉండవచ్చు, కానీ అది స్వల్పకాలికంగా ఉంటుంది.’

కొత్త ప్రధాన మంత్రిగా మాజీ ప్రధాన మంత్రి తక్సిన్ షినవత్రా కుమార్తె పేటోంగ్టార్న్ షినవత్రా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ న్యాయ మంత్రి చైకాసెం నీతిసిరి, అంతర్గత మంత్రి, డిప్యూటీ ప్రీమియర్ అనుతిన్ చర్న్విరాకుల్, ఇంధన మంత్రి పిరపన్ సాలిరథ విభాగ, గత తిరుగుబాట్లకు పేరుగాంచిన మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్ పేర్లు థాయ్‌లాండ్ కొత్త ప్రధాని రేసులో ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios