Asianet News TeluguAsianet News Telugu

థాయ్ లాండ్ విషాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక చిన్నారి.. గాఢనిద్రే ప్రాణభిక్ష పెట్టింది..

థాయ్ లాండ్ లో మూడు రోజుల క్రితం జరిగిన డేకేర్ సెంటర్ కాల్పుల్లో ఒకే ఒక చిన్నారి బతికి బయటపడింది. దీనికి కారణం ఆ సమయంలో ఆ చిన్నారి గాఢనిద్రలో ఉండడమేనట. 

 

The only child who survived the tragedy in Thailand
Author
First Published Oct 10, 2022, 8:03 AM IST

థాయిలాండ్ : థాయిలాండ్ లోని ఓ ‘డే కేర్’ సెంటర్ లో ఇటీవల ఓ ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 24 మంది చిన్నారులతో పాటు 30 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే,  ఈ మారణకాండలో అక్కడే ఉన్న ఓ చిన్నారి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడటం విశేషం. కారణం.. ఆ సమయంలో ఆమె తరగతి గదిలో ఓ మూలలో దుప్పటి కప్పుకొని నిద్ర పోతూ ఉంది. ఆమె మూడేళ్ల ‘పవీనట్ సుపొల్ వాంగ్’. ఘటన సమయంలో ఆమె గాఢంగా నిద్ర పోతోందని, అప్పటికే ఆమెపై దుప్పటి కప్పి ఉందని తల్లిదండ్రులు తెలిపారు. 

ఇదే ఆమె ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. ఈ దారుణం నుంచి క్షేమంగా తప్పించుకున్న ఏకైక చిన్నారి పవీనట్ సుపొల్ వాంగ్  కావడం గమనార్హం. తాను షాక్ లో ఉన్నానని పాప తల్లి పనోమ్ పాయ్ సితోంగ్ ఓ వార్తా సంస్థతో చెప్పారు. తన బిడ్డ బతికి ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఇతర కుటుంబాలను చూస్తే బాధేస్తోంది అన్నారు. ఇది విచారం, కృతజ్ఞత కలగలిపిన కొత్త అనుభూతి అని సితోంగ్ వివరించారు. అయితే, ఈ  ఈ విషాదం గురించి చిన్నారికి జ్ఞాపకం లేకపోవచ్చు అని కూడా ఆమె తెలిపారు.  ఘటనా స్థలం నుంచి నిందితుడు వెళ్లిపోయిన తర్వాత గదిలోని ఒక మూలలో కదలికల ఆధారంగా పాప బతికి ఉన్నట్లు గుర్తించారు. 

థాయ్ లాండ్ లో దారుణం.. డే కేర్ సెంటర్ లో మాజీ పోలీసు కాల్పులు.. 34 మంది మృతి..

తోటి పిల్లల మృతదేహాలు కనిపించనీయకుండా అలాగే దుప్పటితో ఆమె ముఖాన్ని కప్పి ఉంచి బయటికి తీసుకు వచ్చారని తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన చిన్నారుల్లో 11మంది ఆమె నిద్రిస్తున్న గదిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, తన కుమార్తెను ఆత్మలే రక్షించాయని తల్లి పేర్కొనడం గమనార్హం. సాధారణంగా చిన్న చప్పుడుకే ఆమె నిద్ర లేస్తుంది. కానీ ఆరోజు మాత్రం చుట్టూ.. అంతమంది అరుపులు, కేకలు, గన్ ఫైర్ అవుతున్నా ఆమె లేవకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ సమయంలో ఆమె గాఢనిద్రలోకి వెళ్లిందని.. దీనికి కారణం ఆ సమయంలో ఆమె కళ్ళు చెవులను ఆత్మలు మూసినట్లు నమ్ముతున్నానన్నారు. 

అందరికీ వేరు వేరు నమ్మకాలు ఉంటాయి. నా విషయంలో మాత్రం ఇదే’ అని వివరించారు.  ఈ ఘటనలో చిన్నారి బెస్ట్ ఫ్రెండ్, రెండేళ్ల టెకిన్ మృతి చెందిందని.. ఈ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పామని అన్నారు. ఈ ఘటన గురించి ఆమెకు పూర్తిగా తెలియదని అన్నారు. మరో బంధువు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పాప ప్రాణాలతో బయటపడటం అద్భుతంగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా ఈ దురాగతానికి పాల్పడిన నిందితుడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios