కెనడా పార్లమెంట్ లో హర్దీప్ సింగ్ ప్రస్తావన.. ఇంతకీ ఎవరీయన.. భారత్ కు ఉన్న సంబంధమేంటి?
ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయ ఉందని ఆ దేశ ప్రధాని పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిని భారత్ తిరస్కరిచింది. అతడిపై భారత్ లో అనేక కేసులు ఉన్నాయి. 2022లో అతడి కోసం ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ లో కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని దేశ ప్రధాని ఆ దేశ పార్లమెంట్ లో ప్రస్తావించారు. ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో సోమవారం మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఏజెంట్లకు, నిజ్జర్ హత్యకు సంబంధం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు దారితీశాయి.
కాగా.. ఇంత వరకు స్నేహపూర్వకంగా ఉన్న కెనడా, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ నిజ్జర్ గా ఉన్న ఆయనను జూన్ 18వ తేదీన గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. 1997లో నకిలీ పాస్ పోర్టుతో అతడు భారత్ నుంచి కెనడాకు వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం పొందేందుకు తనను తాను శరణార్థి అని చెప్పుకున్నాడు. కానీ దానిని అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది. తరువాత ఇమ్మిగ్రేషన్ కోసం స్పాన్సర్ చేసిన మహిళనే వివాహం చేసుకున్నప్పటికీ.. దానిని కూడా తిరస్కరించింది. అనంతరం హౌస్ ఆఫ్ కామన్స్ లో ట్రూడో ఆయనను కెనడియన్ గా పేర్కొన్నట్లు ‘గ్లోబల్’ నివేదించింది.
2020 సంవత్సరంలో నిజ్జర్ ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు నిషేధిత ఉగ్రవాద సంస్థ కేటీఎఫ్ కోసం వ్యక్తులను రిక్రూట్ చేసుకునేవాడు. వారికి శిక్షణ ఇవ్వడంలోనూ నిజ్జర్ చాలా యాక్టివ్ గా ఉండేవాడని భద్రతా సంస్థలు తెలిపాయి. సెప్టెంబర్ 10న ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించిన వేర్పాటువాద సంస్థ సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా నిజ్జర్ కు ఉగ్రవాద కార్యకలాపాలతో ఉన్న సంబంధాలపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. 2018లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిజ్జర్ పేరుతో వాంటెడ్ వ్యక్తుల జాబితాను జస్టిన్ ట్రూడోకు అందజేశారు.
నిజ్జర్ పంజాబ్ లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేసే కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, కాబట్టి అతడిని తమకు అప్పగించాలని ఆ రాష్ట్ర పోలీసులు 2022లో కెనడాను కోరారు. అతడు పంజాబ్ లోని లుధియానా నగరంలో 2007లో ఆరుగురి మృతి, 42 మందిని గాయపరిచిన పేలుడు సహా పలు కేసుల్లో నిజ్జర్ నిందితుడిగా ఉన్నాడు. 2010లో పటియాలాలోని ఓ ఆలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో అతడిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రిటన్ కు చెందిన మరో వాంటెడ్ టెర్రరిస్టు పరమ్ జిత్ సింగ్ పమ్మా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
2015లో నిజ్జర్ పై హిందూ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని, మన్ దీప్ ధలివాల్ కు శిక్షణ, నిధులు సమకూర్చడంలో ప్రమేయం ఉందని, హిందూ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఆయనపై మరో కేసు నమోదైంది. 2015, 2016లో నిజ్జార్ పై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ వోసీ), రెడ్ కార్నర్ నోటీసు (ఆర్ సీఎన్ ) జారీ అయ్యింది. 2018లో పంజాబ్ లో ఆర్ఎస్ఎస్ నేతల హత్యలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. 2022లో పంజాబ్ లోని జలంధర్ లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజ్జర్ కు ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.