Asianet News TeluguAsianet News Telugu

తాలిబాన్లకు తలవంచని పంజ్‌షిర్.. ఇక్కడి నుంచే తిరుగుబాటు!

తాలిబాన్లు యావత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకున్నప్పటికీ పంజ్‌‌షిర్ కంచుకోటను స్వాధీనపరుచుకోవడం సాధ్యం కాలేదు. తాలిబాన్లకే కాదు, విదేశీ సేనలనూ అడుగుపెట్టనీయని గడ్డ పంజ్‌షిర్. ఇప్పుడు తాలిబాన్ల అరాచకాల నుంచి ఉపశమనాలను ఆలోచిస్తున్నవారందరి మెదళ్లలో కదులుతున్నది పంజ్‌షిర్ ప్రావిన్సే. ఇప్పటికే దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పంజ్‌షిర్ చేరుకుని తాలిబాన్ వ్యతిరేక కూటమి సమీకరించే పనిలో ఉన్నారు. తాలిబాన్లపై పోరాటానికి సంసిద్ధమన్నట్టుగా జెండా ఎగరేయడం గమనార్హం.

the last citedel panjshir stands against talibans
Author
New Delhi, First Published Aug 18, 2021, 7:59 PM IST

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలపాటు అమెరికా, నాటో బలగాలపై గెరిల్లా పోరు చేసి ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబాన్లకు పంజ్‌షిర్ లోయ సవాల్ విసురుతున్నది. యావత్ దేశాన్నంతా ఆక్రమించుకున్నప్పటికీ ఈ లోయ తలవంచలేదు. తాలిబాన్లకే కాదు, విదేశీ సేనలకూ తలవంచకుండా ఎదురొడ్డి నిలిచిన గడ్డ పంజ్‌షిర్. అంతేకాదు, ఇప్పుడు తాలిబాన్లను వ్యతిరేకిస్తున్నవారందరికీ ఇదే ఆశాద్వీపంగా కనిపిస్తున్నది. ఇప్పటికే తాలిబాన్లపై తిరుగుబాటు జెండా ఎగరేసింది. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ కంచుకోట పంజ్‌షిర్ చేరుకుని తాలిబాన్లకు వ్యతిరేకంగా కూటమిని సమీకరించే పనిలో ఉన్నాడు. ఓ చోట తాలిబాన్లను ప్రతిఘటిస్తామన్న సంకేతాన్ని సూచించేలా జెండా ఎగరేయడం గమనార్హం.

ఈశాన్య కాబూల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ ఉన్నది. దీన్ని ఇప్పటికీ తాలిబాన్‌లు ఆక్రమించుకోలేకపోయారు. ఎప్పటికీ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే పంజ్‌షిర్ అంటే పర్షియాకు చెందిన ఐదు సింహాలని అర్థం. దేశంలోని 32 ప్రావిన్స్‌లలో  ఒకటైన్ పంజ్‌షిర్‌లో ఏడు జిల్లాలున్నాయి. సుమారు 1.73 లక్షల జనాభా ఉన్నది. పంజ్‌షిర్‌కు విదేశాలతో సరిహద్దు లేదు. అయినప్పటికీ తాలిబాన్లు దీన్ని ఆక్రమించుకోవడం అసాధ్యంగానే ఉన్నది. అందుకే దేశ ఉపాధ్యక్షుడుఇక్కడికి చేరుకుని తిరుగుబాటు ప్రకటించారు.

దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇప్పుడు తానే దేశ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. దేశ అధ్యక్షుడు పారిపోయినప్పుడు లేదా అదృశ్యమైనప్పుడు, మరణించినా, రాజీనామా చేసిన రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. తాను ఇప్పుడు దేశంలోనే ఉన్నారని, చట్టం ప్రకారం, తానే అధ్యక్షుడినని సలేహ్ ప్రకటించుకున్నారు. తనకు మద్దతునిచ్చే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు.

పంజ్‌షిర్ స్వతంత్రతను కాపాడటంలోనే కన్నుమూసిన సీనియర్ కమాండర్, యాంటీ తాలిబాన్ లీడర్ అహ్మద్ షా మసూద్‌నూ సలేహ్ కలిశారు. ఇక్కడి నుంచే తాలిబాన్ వ్యతిరేక కూటమి నార్తర్న్ అలయెన్స్ మరోసారి జవసత్వాలు నింపుకోనున్నట్టు తెలుస్తున్నది. ఈ నార్తర్న్ అలయెన్స్ జెండా పంజ్‌షిర్‌లో రెపరెపలాడుతున్నది. తాలిబాన్‌లపై ఫైట్ చేయడానికి సంకల్పించినట్టు ఈ జెండా స్పష్టం చేసింది.

తాలిబాన్‌లను ఎదుర్కోవడానికి 1996లో ఏర్పడిన సంస్థ నార్తర్న్ అలయెన్స్ దీనికి భారత్ సహా ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌ల మద్దతు ఉన్నది. 1996-2001లో తాలిబాన్‌ల హయాంలోనూ నార్తర్న్ అలయెన్స్ దీటైన సమాధానమిచ్చింది. ఇప్పుడూ తాలిబాన్‌లను ఈ గ్రూపే ప్రతిఘటించే అవకాశముంది. అయితే, సలేహ్, మసూద్, ఆయన ఫాలోయర్లకు ఇది కఠిన పరిస్థితే. గతంలో కంటే ఇప్పుడు తాలిబాన్లు ప్రభుత్వ, అమెరికా వదిలిన ఆయుధాలు స్వాధీనపరుచుకుని పటిష్టమైంది. వారిని ఓడించడం అంత సులభమైన పనేం కాదు. కాగా, ఇప్పటికే కొందరు తాలిబాన్ వ్యతిరేకులు పంజ్‌షిర్‌కు చేరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios