సోషల్ మీడియాల్లోని అనేక మీమ్స్ పేజీల్లో మనకు ఎంతో ఆనందాన్ని పంచిన చీమ్స్ కుక్క చనిపోయింది. 2022 డిసెంబర్ నుంచి అది క్యాన్సర్ తో బాధపడుతోంది. అప్పటి నుంచి దాని కోసం చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆ శునకం ఆరోగ్యం విషమించడంతో మరణించింది.

తన కొంటె లుక్ తో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన షిబా ఇను కుక్క చీమ్స్ ఇక లేదు. అనేక మీమ్స్ పేజీల్లో మనకు కనిపిస్తూ ఎంతో ఆనందాన్ని పంచిన ఈ కుక్క శనివారం మరణించింది. చివరి థొరాసెంటెసిస్ శస్త్రచికిత్స తర్వాత అది కన్నుమూసిందనే విషాద వార్తను దాని యజమానులు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సందర్భంగా చిమ్స్ ప్రపంచానికి తెచ్చిన ఆనందాన్ని గుర్తు చేసుకోవాలని అభిమానులను కోరారు. 

చీమ్స్ 2022 డిసెంబర్ నుంచి లుకేమియా (ఒక రకమైన క్యాన్సర్) వ్యాధితో బాధపడుతోంది. అప్పటి నుంచి దాని కోసం చికిత్స పొందుతోంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మందికి సహాయం చేయాలనే తన మిషన్ ఈ కుక్క పూర్తి చేసిందని, అది ఇప్పుడు ఆకాశంలో స్వేచ్ఛగా పరిగెత్తుతోందని దాని యజమాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

View post on Instagram
 

‘‘చింతించకండి, బాల్ట్జే ప్రపంచానికి తెచ్చిన ఆనందాన్ని దయచేసి గుర్తుంచుకోండి. మిమ్మల్ని, నన్ను కలిపే గుండ్రటి చిరునవ్వు ముఖం కలిగిన షిబా ఇను, మహమ్మారి సమయంలో చాలా మందికి సహాయం చేసింది. మీలో చాలా మందికి చాలా ఆనందాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు అతని మిషన్ పూర్తయింది. అతను ఆకాశంలో స్వేచ్ఛగా పరిగెత్తుతున్నాడు. తన కొత్త స్నేహితులతో కలిసి చాలా రుచికరమైన ఆహారాన్ని తింటున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. 

చీమ్స్ అసలు పేరు బాల్ట్జే కాగా, హాంకాంగ్ కు చెందిన ఓ కుటుంబం దానిని ఏడాది వయసులో దత్తత తీసుకుంది. 2010లో తీసిన ఓ ఫొటో వైరల్ గా మారి 2013 చివర్లో 'నో యువర్ మీమ్ ఆఫ్ ది టాప్ మీమ్'గా పేరు తెచ్చుకుంది. కాగా.. చీమ్స్ మరణవార్త బయటకు రావడంతో దాని ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇంటర్నెట్ లో అత్యంత వైరల్ అయిన కుక్కపిల్ల పట్ల తమ సంఘీభావాన్ని, ప్రేమను తెలియజేశారు. 

‘‘ఆర్ఐపీ బడ్డీ.. మీరు చాలా మందికి సంతోషాన్ని అందించారు’’ అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. ‘‘ చీమ్స్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక లెజెండ్. ఒక పోటీ స్థాపకుడు. ఇప్పుడు అతడు అమరుడు. ప్రేమలో విశ్రాంతి తీసుకోండి స్వీట్ బాల్ బాల్. మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రేమించారు’’ అని మరో యూజర్ పేర్కొన్నారు.

Scroll to load tweet…

‘‘నేను ఈ లెజెండ్‌కి మీమ్ ట్రెండ్ ద్వారా పరిచయం అయ్యాను. కొన్నేళ్ల తరువాత దాని మరణం గురించి వినడం చాలా కష్టంగా ఉంది. అది 2020లో చాలా మందికి సహాయం చేసింది. బాగా నిద్రపోండి రాజా.. మేము మిమ్మల్ని మిస్ అవుతాం..’’ అని మరొకరు కామెంట్ చేశారు. కాగా.. ఓ యూజర్ చీమ్స్ కోసం ఓ మీమ్ సృష్టించాడు. అందులో చీమ్స్ ఏంజెల్ రెక్కలు, హాలోతో కనిపిస్తోంది. శునకం పరలోకంలో నుంచి, ప్రశాంతతను ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తోంది.