టొరంటో: కెనడాలో ప్రభుత్వ సేవలకు సంబంధించి వేలాది ప్రభుత్వ ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్టుగా ఆ దేశం ప్రకటించింది. కెనడాలో ఆన్ లైన్ సేవలకు సంబంధించి 30 సమాఖ్య విభాగాలు, రెవిన్యూ ఏజెన్సీ  ఖాతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్టుగా కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

9,401 మంది జీసీకి ఖాతాదారుల పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించారని గుర్తించామన్నారు. వీటిని వెంటనే తొలగించినట్టుగా కెనడా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని 5,500 రెవిన్యూ ఏజెన్సీ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని మరో దాడి చేశారని కెనడా ప్రభుత్వం తెలిపింది. హ్యాకింగ్ కు గురైన అకౌంటన్లను వెంటనే గుర్తించి తొలగించామని కెనడా తెలిపింది.

కెనడాలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హ్యాకింగ్ కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.ఆగష్ట్ మొదటి వారంలోనే చాలా మంది కెనడా ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హ్యాకర్లు ఈ ఖాతాల సమాచారం ఏమైనా దొంగిలించారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.