అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న తెలుగు విద్యార్ధులు

First Published 26, Jun 2018, 5:16 PM IST
telugu students win actinspace 2018 award
Highlights

అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న తెలుగు విద్యార్ధులు.

జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన  ఆక్ట్ ఇన్ స్పేస్ 2018 లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 80 దేశాలు పాల్గొన్న ఈ పోటీలో క్యూటీ స్పేస్ (QUANTUM TECHNOLOGY SPACE)అనే తెలుగు విద్యార్థులు సభ్యులుగా గల టీమ్  అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. 

ఈ టీమ్ సభ్యులు  అంతరిక్ష పరిశోదనల్లో క్వాంటమ్ టెక్నాలజీ  ఉపయోగంపై రూపొందించిన వీడియో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయింది. ఈ వీడియో కు ప్రజల నుండి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ జట్టు కు అవార్డును అందించారు. ఈ పోటీని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ(ESA) తో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు కలిసి నిర్వహించారు.  

క్యూటీ టీమ్ సభ్యులు స్పేస్ టెక్నాలజీలో ఉపయోగించే అటామిక్ క్లాక్ కు బదులు క్వాంటమ్ క్లాక్ ను రూపొందిస్తున్నారు. ఈ క్వాంటమ్ క్లాక్ కొత్త తరం నావిగేషన్ వ్యవస్థలో ఎంతో ఉపయోగపడుతుందని వీరు చెబుతున్నారు. ఇది ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుందని ఈ బృందంలోని సభ్యులు తెలియజేశారు. 

ఆక్ట్ ఇన్ స్పేస్ 2018 అవార్డు విజేతలుగా నిలవడం పట్ల తెలుగు విద్యార్థి ఆకాష్ కాపర్తి ఆనందం వ్యక్తం చేశారు. తమ టీమ్ కష్టపడి సృజనాత్మకంగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. క్యూటీ స్పేస్ టీం సభ్యులు జోచిమ్ మనే, వింద్యా మాదవి,  గ్జియాహూ జూ లతో కలిసి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యపడిందని చెప్పారు. ఇలాగే వారితో కలిసి పనిచేసి మరిన్ని అంతర్జాతీయ అవార్డులు సాధిస్తామని ఆకాష్ కాపర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ తమను ఇలాగే ప్రోత్సహించాలని కోరుతున్నట్లు అతడు తెలిపారు.
 

loader