అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర.. తెలుగు యువకుడు అరెస్ట్.. ట్రక్కులో నాజీ జెండా..
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు కుట్ర పన్నాడని ఓ తెలుగు యువకుడిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ట్రక్కుతో వైట్ హౌస్ మీద దాడికి ప్రయత్నించాడు.
ఢిల్లీ : అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఓ తెలుగు యువకుడు 19యేళ్ల సాయివర్షిత్ అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నినట్టుగా అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఓ తెలుగు వార్తా ఛానల్ కథనం ప్రసారం చేసింది. ఈ ఘటన సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వైట్ హౌస్ పరిసరాల్లో చోటు చేసుకుంది. వైట్ హౌస్ మీద అటాక్ చేయడానికి సాయివర్షిత్ ప్రయత్నించాడు.
కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ దగ్గర బారికేడ్లను.. ఓ ట్రక్కుతో అత్యంత వేగంగా వచ్చి గుద్ది.. మళ్లీ ట్రక్కు వెనక్కి తీసుకుని మళ్లీ గుద్దాడు. ఆ తరువాత స్వస్తిక్ కి గుర్తు ఉన్న నాజీ జెండాను బయటికి తీశాడు సాయి వర్షిత్. అంతేకాదు.. ‘అధ్యక్షుడుని చంపిన తరువాత అధికారాన్ని నా చేతుల్లోకి తీసుకుంటా’ అంటూ వర్షిత్ అన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.
కారు డ్రైవర్‌ను మిస్సోరీలోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్ కందుల (19)గా గుర్తించినట్లు పార్క్ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ మీద దాడికోసమే వాషింగ్టన్ వచ్చాడు. రాగానే ఓ ట్రక్కు అద్దెకు తీసుకుని నేరుగా.. వైట్ హౌస్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో వైట్ హౌస్ దగ్గర కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ, భద్రతా బలగాలు సాయివర్షిత్ ను అదుపులోకి తీసుకున్నారు.
వారి విచారణలో సాయివర్షిత్ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ను చంపడానికి కుట్ర పన్నినట్టుగా ఒప్పుకున్నాడు. గత ఆరునెలలుగా తాను కుట్ర చేస్తున్నట్టుగా సాయి వర్షిత్ ఒప్పుకున్నట్లుగా తెలిసింది. అయితే, సాయి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అంతకు ముందు సాయి వర్షిత్ కు ఎలాంటి నేర చరిత్రా లేదు.
అతని మీద ర్యాష్ డ్రైవింగ్ తో పాటు అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్రకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. "ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేయడం, మోటారు వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లేదా కుటుంబ సభ్యులను చంపేస్తానని/కిడ్నాప్ చేస్తానని/ హాని చేస్తానని బెదిరించడం, ఫెడరల్ ఆస్తిని ధ్వంసం చేయడం, ఉల్లంఘనలు అతిక్రమించడం" వంటి అభియోగాలు మోపబడ్డాయి.