Asianet News TeluguAsianet News Telugu

రెండు దశాబ్దాల్లో తొలిసారి.. విదేశీ సాయం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబాన్లు సొంతంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే యోచన చేస్తున్నారు. అదే జరిగితే.. రెండు దశాబ్దాల్లో విదేశీ సాయం లేకుండా ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌గా ఇది నిలుస్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఈ బడ్జెట్ అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ డ్రాఫ్ట్‌ను క్యాబినెట్ ఆమోదం కోసం పంపిస్తామని, ఆ తర్వాతే ప్రచురిస్తామని వివరించింది.
 

taliban to prepare first budget without foreign aid
Author
New Delhi, First Published Dec 18, 2021, 4:54 PM IST

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో Afghanistan చరిత్రలో కీలక పరిణామాలు జరిగాయి. ప్రజలు ఎన్నుకున్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తాలిబన్లు(Taliban) హస్తగతం చేసుకన్నారు. కాబూల్‌ను సీజ్ చేసిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఆగస్టులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత విదేశీ సాయం నిలిచిపోయింది. ఐఎంఎఫ్ సహా పాశ్చాత్య, ఇతర దేశాలు విదేశీ సాయాన్ని నిలిపేశాయి. అప్పటికే ఆర్థికంగా(Economy) పతన దశలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది దారుణంగా దెబ్బ తీసింది. విదేశీ సాయాన్ని పునరుద్ధరించుకోవడానికి తాలిబన్లు ఛాందస వాదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, అవి సఫలం కాలేదు. స్వయంగా పాకిస్తాన్ కూడా తాలిబన్లకు మద్దతుగా పలు అంతర్జాతీయ వేదికలపై గళం వినిపించారు.

తాలిబన్లు అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకులు చాలా వరకు క్లోజ్ అయ్యాయి. నిత్యావసర సరుకులు భగ్గుమన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాలూ కొన్ని నెలలపాటు అందలేదు. వేతనాల కోసం రోడ్డెక్కి ధర్నాలూ చేశారు. ఇలాంటి సందర్భంలో రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి విదేశీ సాయం లేకుండా బడ్జెట్‌(Budget)ను సిద్ధం చేస్తున్నది. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నట్టు తాలిబన్లు వెల్లడించారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్ఘానిస్తాన్ కరెన్సీ అఫ్ఘాని దారుణంగా పతనం అయింది. తాలిబన్లు రాక పూర్వం ఒక అమెరికన్ డాలర్ విలువ 80 అఫ్ఘానీలు కాగా, ఆ విలువ 130 అఫ్ఘానీలకు పడిపోయింది. తాజాగా, శుక్రవారం ఇది 100 అఫ్ఘానీలకు చేరింది.

Also Read: Afghanistan: తొమ్మిదేళ్ల కూతురిని అమ్మేసిన తండ్రి.. ‘బతకాలంటే తప్పట్లేదు’

ఈ బడ్జెట్‌ను డ్రాఫ్ట్ చేసిన తర్వాత క్యాబినెట్ సభ్యుల పరిశీలనకు పంపుతామని తాలిబన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్  వెల్లడించారు. అయితే, ఈ బడ్జెట్ ఎంత సైజు ఉన్నదనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. తాము దేశీయంగా వసూలు చేస్తున్న పన్నుల ద్వారానే ఫైనాన్స్ చేయాలని అనుకుంటున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇది సాధ్యం అవుతుందని తాము విశ్వసిస్తున్నట్టు వివరించారు.

తాలిబన్ ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ప్రకారం, గడిచిన రెండున్నర నెలల్లో 26 బిలియన్ల అఫ్ఘానీలను సేకరించినట్టు తెలుస్తున్నది. ఇందులో 13 బిలియన్ అఫ్ఘానీలు కస్టమ్స్ సుంకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరినట్టు ఆ డిపార్ట్‌మెంట్ వివరించింది. అంతేకాదు, దేశంలోని పేదలు, అనాధలకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా ఇస్లామిక్ ట్యాక్స్‌ను ఈ శాఖ ప్రకటించింది.

Also Read: Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

ఆ దేశంలో ప్రజలు వారి రోజువారీ అవసరాలూ తీర్చుకోవడం కష్టసాధ్యమవుతున్నది. కనీసం ఇంకొన్ని సంవత్సరాలైనా బతికితే చాలు అనేంతటి దుస్థితికి ప్రజలు పడిపోయారు. ఈ పరిస్థితుల్లేనే కుటుంబాలు కౌమారదశలోని పిల్లలను సంపన్న వృద్ధులకు అమ్ముకుంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి తన కూతురును అమ్ముతున్నట్టు అబ్దుల్ మాలిక్ తెలిపారు. తన తొమ్మిదేళ్ల కూతురు పర్వానా మాలిక్‌ను 55ఏళ్ల ఖోర్బన్‌కు గత నెల అమ్మినట్టు తండ్రి అబ్దుల్ మాలిక్ వివరించారు. రెండు నెలల క్రితమే తన 12ఏళ్ల కూతురిని అమ్మేసినట్టు చెప్పారు. ఇప్పుడు మరో కూతురిని అమ్మేయక తప్పడం లేదని వాపోయారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రాణాలతో ఉండాలంటే ఈ నిర్ణయం తప్పడం లేదని చెప్పారు. ఈ నిర్ణయం తనను దహించి వేస్తున్నదని, సిగ్గుతో మనసు గింజుకుంటున్నా తప్పడం లేదని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios