నూతన వధువును ఇంటికి తీసుకెళ్లడానికి ఆ తాలిబాన్ కమాండర్ ఏకంగా మిలిటరీ హెలికాప్టర్‌నే వాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. కాగా, అలాంటిదేమీ లేదని తాలిబాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. 

న్యూఢిల్లీ: మిలిటరీ హెలికాప్టర్ దేశ సంపద. దాన్ని దేశ భద్రత కోసం, రక్షణ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. మిలిటరీలో ఉన్నత స్థానాల్లో ఉన్నామని, వ్యక్తిగతంగా వినియోగిస్తామంటే కుదరదు. కానీ, తాలిబాన్లు రాజ్యం ఏలుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది సాధ్యమే అని ఓ వార్తా కథనం వెల్లడించింది. ఎందుకంటే.. తాలిబాన్ కమాండర్ తన నూతన వధువును ఇంటికి తెచ్చుకోవడానికి మిలిటరీ హెలికాప్టర్‌ను వాడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. కానీ, తాలిబాన్ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నది.

నూతన వధువును తీసుకురావడానికి హెలికాప్టర్ వినియోగించిన వ్యక్తిని హక్కానీ బ్రాంచ్ తాలిబాన్ సోషల్ మీడియా కమాండర్‌గా ఆఫ్ఘనిస్తాన్ స్థానిక మీడియా ఖామా ప్రెస్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది. మిలిటరీ హెలికాప్టర్‌ తో తాలిబాన్ కమాండర్ పెళ్లి కుమార్తె ఇంటి ముందు దిగాడు. పెళ్లి కుమార్తె తండ్రి కి సుమారు 12 లక్షల అఫ్ఘనీ లను కట్నంగా ఇచ్చాడు. బిడ్డను పెళ్లి చేసి తనకు అప్పజెప్పుతున్నందుకు ఈ డబ్బు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. 

తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో ఆ తాలిబాన్ కమాండర్ నివసిస్తున్నాడు. వధువును లోగార్ ప్రావిన్స్‌లోని బర్కి బారాక్ జిల్లా నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్లాడు. ఈ ఘటన శనివారం లోగార్ ప్రావిన్స్‌లోని షా మజర్‌ ఏరియాలో జరిగినట్టు ఆ కథనం పేర్కొంది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ప్రజా ధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనను కొట్టి పారేసింది. ఇది శత్రువు దుష్ప్రచారం అని తాలిబాన్ డిప్యూటీ స్పోక్స్‌ పర్సన్ ఖారి యూసుఫ్ అహ్మది వాదించారు. ఈ ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని పేర్కొన్నారు. తాలిబాన్ కమాండర్ హెలికాప్టర్ వినియోగించాడనే ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తోసిపుచ్చు తున్నట్టు తెలిపారు.