తాలిబాన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో ఇకపై ఓపియం సహా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన పంటను సాగు చేయరాదని ఆదేశించింది. ఈ పంటలపై నిషేధం విధించినట్టు దేశ అంతర్గత శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ: తాలిబాన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓపియం సహా మాదక ద్రవ్యాల సాగుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం నేత హైబతుల్లా అఖుంద్‌జాదా పేరిట ఈ ఆదేశాలు వచ్చాయి. ఇక పై ఆఫ్ఘనిస్తాన్‌లో మాదక ద్రవ్యాల సాగు ఉండబోదని, మాదక ద్రవ్యాల సాగుపై నిషేధం విధిస్తున్నట్టు ఆ ఉత్తర్వులు వెల్లడించాయి. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే.. వారి పంటను నాశనం చేయడం జరుగుతుందని తెలిపాయి. అంతేకాదు, ఉల్లంఘించిన వారిని షరియా చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నాయి. ఈ ఆదేశాలను దేశ రాజధాని కాబూల్‌లో విలేకరుల సమావేశంలో అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఓపియంతో సహా ఇతర మాదక ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం, రవాణాలనూ నిషేధిస్తున్నట్టు తాలిబాన్ ప్రభుత్వం పేర్కొంది. గతేడది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని అందిపుచ్చుకున్న తాలిబాన్లు ప్రపంచ గుర్తింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఆ దేశ నిధులపై విధించిన ఆంక్షలను సడలిస్తే వాటిని వినియోగించుకోవాలనే ప్రణాళికల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో మాదక ద్రవ్యాల సాగును నిషేధించాలని అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది.
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల సాగుదారు. ఇక్కడే అత్యధికంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తాలిబాన్లు అధికారంలోకి రాకమునుపు కూడా దాని దాడులు, ఇతర ఖర్చుల కోసం ఈ డ్రగ్స్ సాగుపైనే ఎక్కువగా ఆధారపడేది.
గతంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ సాగుపై నిషేధం విధించింది. దాని పాలన చివరి రోజుల్లో 2000ల్లో ఈ నిషేధం విధించింది. అప్పుడు కూడా తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ మద్దతు లభించాలనే లక్ష్యంగానే ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో దాని వైఖరిని మళ్లీ మార్చుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా ఈ నిషేధ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఉన్నారు. తాలిబాన్ గ్రూపులోనే ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తున్నది.
దేశంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం అంచులకు వెళ్లింది. దీంతో సాధారణ రైతులు కూడా తమ కుటుంబ జీవనాన్ని వెళ్లదీయడానికి, సమర్థంగా కుటుంబాన్ని నడపడానికి గోధుమ పంట ద్వారా సాధ్యం కాదని భావిస్తున్నారు. అందుకే చాలా మంది గోధుమ పంటకు బదులు డ్రగ్స్‌ను సాగు చేస్తున్నారు. తాలిబాన్లు ఈ పంటపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయనే వదంతలు ఇది వరకే వ్యాపించడంతో మార్కెట్లో వాటి రేట్లు అమాంతం పెరిగాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఓపియం సాగు ఇటీవల విపరీతంగా పెరిగినట్టు రైతులు, తాలిబాన్ నేతలు చెప్పారు. 2017లో పతాక స్థాయికి చేరినట్టు ఐరాస అంచనా వేసింది. అప్పుడు 1.4 అమెరికన్ బిలియన్ డాలర్ల విలువైన మాదక ద్రవ్యాలను ఆఫ్ఘనిస్తాన్‌లో సాగు అయినట్టు వివరించింది.
