Sydney floods: ఆస్ట్రేలియాలో వరదల పరిస్థితిపై ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తన మంత్రివర్గ సహచరులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం వరదలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించి నిర్వాసితులకు అండగా నిలుస్తోందని తెలిపారు.
Sydney floods: భారీ వర్షాలు ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ ప్రావిన్స్ సహా పలు ప్రాంతాలలో వరదలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50,000 మంది నివాసితులను ఖాళీ చేయమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరదమప్పు ప్రభావం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకారం.. నగరం పశ్చిమ భాగంలోని విండ్సర్‌లో భారీ వరదలు నమోదయ్యాయి. వరదల కారణంగా 19,000 కంటే ఎక్కువ గృహాలు విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నాయని AFP నివేదించింది.
వరదల ప్రభావం కొనసాగుతున్నదనీ, రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ పెరోటెట్ చెప్పారు. రాష్ట్రమంతటా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అయితే, వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో వరదల పరిస్థితిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తన క్యాబినెట్ సహచరులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. బుధవారం ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వం వరదలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించి నిర్విరామంగా నిర్వాసితులకు అండగా నిలుస్తోందని తెలిపారు.
సిడ్నీ వరదలకు సంబంధించిన టాప్ విషయాలు ఇలా ఉన్నాయి..
1. సిడ్నీ, దాని చుట్టుపక్కల వందలాది గృహాలు నీట మునిగాయని రాయిటర్స్ నివేదించింది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరంలో వరదల కారణంగా రోడ్లపై వందలాది కార్లలో ప్రజలు చిక్కుకుపోయారు. రెస్పాన్స్ టీమ్ రాత్రిపూట 100 మందిని రక్షించిందని స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజర్ ఆష్లే సుల్లివన్ తెలిపారు.
2. బ్యూరో ఆఫ్ మెటియోరాలజీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్ హౌ, దక్షిణ సిడ్నీలోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఇది నగరం వార్షిక సగటులో 17 శాతం కంటే ఎక్కువ. మంగళవారం సిడ్నీ తూర్పు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. హెచ్చరికలు సిడ్నీకి ఉత్తర తీరం ప్రాంతం నుంచి హంటర్ వ్యాలీకి వరకు ఉన్నాయి.
3. హాక్స్‌బరీ-నేపియన్ నదీ వ్యవస్థ నగర ఉత్తర, పశ్చిమ అంచుల వెంబడి వరద ప్రభావం మరింద ఆందోళనకరంగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
4. నైరుతి సిడ్నీలోని లాన్స్‌వేల్ నివాసితులు ఆకస్మికంగా వరద ప్రభావం పెరుగుదలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. 1986-88ల తర్వాత మళ్లీ అప్పటిలాగా ప్రమాదకర వరదలను చూస్తున్నామని చెబుతున్నారు.
5. న్యూ సౌత్ వేల్స్ తీరం వెంబడి నెలకొన్న ప్రతికూల వాతావారణం కారణంగా 21 మంది సిబ్బందితో దెబ్బతిన్న కార్గో షిప్‌ను సముంద్రం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రణాళికలను దెబ్బతీశాయని అధికారులు తెలిపారు.
6. సోషల్ మీడియాలో వరదలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న అనేక మందిని విపత్తు నిర్వహణ అధికారులు రక్షించారు.
