సారాంశం

Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలపాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి వస్తున్నారు. కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన ఆమె ఇన్ని రోజులు అక్కడ ఎందుకు ఉంది? అసలు ఏం జరిగింది? ఇతర విషయాలు మీకోసం.

Sunita Williams: ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా వ్యోమగామి సునీతపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ చాలా కాలం తర్వాత భూమి మీదకు తిరిగి వస్తున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఉన్న క్రూ-9కి చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా అంతరిక్షం నుంచి భూమికి బయలుదేరారు.

కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలల కంటే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. అసలు ఎందుకు అలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

జూన్ 5న బయలుదేరిన సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్ క్రూ మిషన్ లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రానాట్ బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చే సామర్థ్యాన్ని పరీక్షించడం.

సునీతా విలియమ్స్ తిరిగి రావడానికి ఎదురైన ఇబ్బందులు

బోయింగ్ CST-100 Starliner Crew-9 మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి పరిశోధనలు, ప్రయోగాలు చేయాల్సి ఉంది. అలాగే మిషన్ సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌ను స్వయంగా నడిపి చూడాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం రావడంతో వారి తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. దీంతో వీరిద్దరూ దాదాపు 9 నెలలు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది.

స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో వచ్చిన సాంకేతిక లోపాలు

1-  రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్‌లు ఫెయిల్ అవ్వడం
స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని 28 రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్‌లలో 5 ఫెయిల్ అయ్యాయి. దీంతో పాటు 5 హీలియం లీక్‌లు కూడా జరిగాయి. దీనివల్ల స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమికి తిరిగి తీసుకురావడం ఏమాత్రం సురక్షితం కాదు. ఆ తర్వాత స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ 6 సెప్టెంబర్ 2024న వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది.

2- దీని తర్వాత వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను SpaceXకి అప్పగించారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ కొన్ని నెలల వ్యవధిలో 4 వ్యోమగాములను ISSకి తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న పాత సిబ్బందిని తిరిగి తీసుకువస్తుంది.

3- SpaceX 28 సెప్టెంబర్ 2024న క్రూ-9 మిషన్‌ను ప్రారంభించినప్పుడు అందులో 4 వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది. కానీ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచారు. ఆ తర్వాత క్రూ-8 స్పేస్ స్టేషన్‌లో పార్క్ చేసిన తమ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.

4- 15 మార్చి 2025న స్పేస్‌ఎక్స్ 4 వ్యోమగాములతో క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది. ఇప్పుడు క్రూ-9కి చెందిన నలుగురు వ్యోమగాములు తమ బాధ్యతలను క్రూ-10కి అప్పగించిన తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తున్నారు.