బీజింగ్: కరోనా నేపథ్యంలో చైనాలో స్కూళ్లకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రత్యేకమైన టోపీలను ధరించి విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు.ఈ తరహా టోపీలు లేని విద్యార్థులను స్కూళ్లకు అనుమతివ్వడం లేదు. 

కరోనా వైరస్ నుండి చైనా క్రమంగా బయటపడుతోంది. వుహాన్ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొత్త కేసులు లేవు. రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకొన్నారు. మరో వైపు దేశ వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకొంటున్నాయి.

కరోనా నేపథ్యంలో స్కూళ్లకు వచ్చే విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. విద్యార్థుల మధ్య దూరం పాటించేలా ముందు జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లకు పంపుతున్నారు.

ప్రతి విద్యార్ధికి మాస్కుతో పాటు తలపై ప్రత్యేకంగా రూపొందించిన టోపిని ధరించి స్కూల్ కు పంపుతున్నారు. చైనాలో హాంగ్ ఝౌ సిటీలోని  ఓ స్కూల్ లో పిల్లలు సామాజిక దూరం పాటించేలా ఉండేందుకు డీఐవై టోపీలను పెట్టుకొని విద్యార్థులు స్కూల్ కు హాజరయ్యారు.

ఈ టోపీకి రెండు వైపులా మూడు అడుగుల పొడవున అట్టముక్కలతో  రెక్కలను అమరుస్తున్నారు. దీంతో ఒక విద్యార్ధి మరో విద్యార్ధి దగ్గర దగ్గర కూర్చోవడానికి వీలుండదు. దగ్గరగా కూర్చొంటే టోపీలపై అమర్చిన రెక్కలు తాకుతాయి. దీంతో వీరిద్దరూ దగ్గర కూర్చోలేరు. ఇద్దరి మధ్య దూరం పాటించేందుకు వీలుగా టోపీలకు ప్రత్యేకంగా ఈ రెక్కలను ఏర్పాటు చేశారు.

మరికొందరు ఈ టోపీలకు అట్టముక్కలకు బదులుగా  రెండు బెలూన్లను కూడ అమరుస్తున్నారు. బెలూన్లు   టోపీలకు రెండు వైపులా వేలాడుతాయి. దీంతో ఇద్దరు విద్యార్థులు దగ్గరగా కూర్చొనే వీలుండదు.

విద్యార్థులు ఈ తరహా హెడ్జర్లను పెట్టుకోకుండా స్కూల్  కు వస్తే అనుమతించడం లేదు. ఈ తరహా హెడ్జర్ల పెట్టుకొని విద్యార్థులు స్కూల్ కు రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న మీడియా సంస్థ ప్రకటించింది.