సారాంశం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపానికి పశ్చిమాన మంగళవారం తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపానికి పశ్చిమాన మంగళవారం తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ(బీఎంకేజీ) వివరాలను వెల్లడించింది. భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికను జారీ చేసింది. సునామీ హెచ్చరిక నేపథ్యంలో ప్రభావిత ప్రాంతంలోని నివాసితులను తీరం నుంచి దూరంగా ఉండాలని ఇండోనేషియా అధికారులు కోరారు.
జకార్తా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 03:00 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మెంటావై దీవుల జిల్లాలో 177 కి.మీ వాయువ్యంగా, సముద్రగర్భం కింద 84 కి.మీ లోతులో ఉంది. భూకంపం యొక్క ప్రకంపనలు భారీ అలలను ప్రేరేపించే అవకాశం ఉన్నందున అధికారులు సునామీ హెచ్చరికను జారీ చేశారు.
ఇండోనేషియా యొక్క విపత్తు ఉపశమన ఏజెన్సీ అధికారులు సుమత్రా పశ్చిమ తీరంలో భూకంప కేంద్రానికి సమీపంలోని ద్వీపాల నుంచి డేటాను సేకరిస్తున్నారని అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. పశ్చిమ సుమత్రా రాజధాని పడాంగ్‌లో భూకంపం తీవ్రంగా ఉందని.. కొంతమంది బీచ్‌లకు దూరంగా ఉన్నారని అబ్దుల్ చెప్పారు. ఆయన ప్రస్తుతం పడాంగ్‌లోనే ఉన్నారు.
‘‘ప్రజలు వారి ఇళ్లను విడిచిపెట్టారు. కొందరు భయాందోళనలకు గురయ్యారు. కానీ నియంత్రణలో ఉన్నారు. ప్రస్తుతం వారిలో కొందరు తీరం నుంచి ఖాళీ చేస్తున్నారు’’ అని అబ్దుల్ చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు.