ఫ్యామిలీ సెపరేషన్ పై ట్రంప్‌కు షాక్ ఇచ్చిన కాలిఫోర్నియా జడ్జీ!

Stop Seperating Families: California Federal Judge
Highlights

జీరో టోలరెన్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. మెక్సికో సరిహద్దుల వద్ద అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న నెపంతో పిల్లలను, తల్లిదండ్రులను విడదీస్తున్న అమెరికా అధికారులపై ఆదేశ న్యాయస్థానాలు మండిపడుతున్నాయి.

జీరో టోలరెన్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. మెక్సికో సరిహద్దుల వద్ద అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న నెపంతో పిల్లలను, తల్లిదండ్రులను విడదీస్తున్న అమెరికా అధికారులపై ఆదేశ న్యాయస్థానాలు మండిపడుతున్నాయి. నెల రోజుల్లోగా పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కోర్టులు ఆదేశిస్తున్నాయి.

ఇమిగ్రేషన్‌ అధికారులు తల్లిదండ్రుల నుండి పిల్లలను వేరు చేయటాన్ని సవాలు చేస్తూ అమెరికా పౌరహక్కుల సంఘం (ఎసిఎల్‌యు) దాఖలుచేసిన పిటిషన్‌కు విచారణకు స్వీకరించిన అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి డానా సాబ్రా ఈ మేరకు (స్టే) ఉత్తర్వులిచ్చారు. వాషింగ్టన్‌, న్యూయార్క్‌, మేరీల్యాండ్‌, న్యూజెర్సీ, వర్జీనియాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన 'జీరో టోలరెన్స్‌'లో భాగంగా ఆ దేశంలోకి అక్రమంగా వలస వచ్చేవారి పిల్లలను తల్లిదండ్రులతో విడదీయడాన్ని నిలిపివేస్తున్నామని అధ్యక్షుడు ఇటీవల ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఇదంతా తాత్కాలికమేనని, తల్లిదండ్రుల నుండి పిల్లలను విడదీయటాన్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ తన ఆదేశంలో ఎక్కడా పేర్కొనలేదని అమెరికా రాష్ట్రాలు కోర్టులలో వేసిన వాజ్యాలలో పేర్కొన్నాయి.

జీరో టోలరెన్స్ పేరిట ఇప్పటికే దాదాపు రెండు వేల మందికి పైగా వలసవాసుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి వేరు చేసి సరిహద్దుల వద్ద ఉన్న ప్రత్యేక కేంద్రాలలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన పిల్లలలో ఐదేళ్ల లోపు వయస్సున వారిని రెండు వారాల్లోగా, అలాగే ఐదేళ్లకు మించిన వయసున్న వారిని నెల రోజులలోపుగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు.

 

loader