పాకిస్తాన్‌‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరుగుతుంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధమ పిండి నిల్వలు మార్కెట్‌లో తగ్గిపోయాయి.

పాకిస్తాన్‌‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరుగుతుంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధమ పిండి నిల్వలు మార్కెట్‌లో తగ్గిపోయాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. సబ్సిడీపై పండి పంపిణీ చేసే కొన్ని చోట్ల తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని మిర్‌పుర్‌ఖాస్ జిల్లాలో సబ్సిడీపై అందజేసే పిండిని ప్రజలకు విక్రయించడంలో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణించారు. ఆయన ఏడుగురు పిల్లల తండ్రి. 

కమీషనర్ కార్యాలయం సమీపంలో గులిస్తాన్-ఎ-బల్దియా పార్క్ వెలుపల రెండు మినీ ట్రక్కులలో పిండి బ్యాగులను పంపిణీ చేసేందుకు వచ్చాయి. మినీ ట్రక్కులలోని 10 కిలోల పిండి బస్తాలను కిలో రూ. 65 చొప్పున విక్రయిస్తున్నారు. ఇతరుల కంటే ముందుగా బ్యాగ్‌ని పట్టుకోవడానికి ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ పెద్ద ఎత్తున మినీ ట్రక్కుల వద్ద దూసుకొచ్చారు. అయితే 40 ఏళ్ల హర్సింగ్ కొల్హి హడావిడిలో రోడ్డుపై పడిపోయాడు. అతడిపై నుంచి జనాలు వెళ్లడంతో మరణించాడు. అయితే తొక్కిసలాటకు కారణమేమిటో ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఆహార శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్హీ కుటుంబం ఐదు గంటల పాటు నిరసన తెలిపారు. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు. ఇక, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.

మినీ-ట్రక్కులు లేదా వ్యాన్‌ల ద్వారా పిండిని విక్రయించే చాలా చోట్ల ఇలాంటి గందరగోళ దృశ్యాలే కనిపించాయి. పాకిస్తాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో గోధుమలు, పిండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరాచీలో పిండి కిలో రూ.140 నుంచి రూ.160కి విక్రయిస్తున్నారు. ఇస్లామాబాద్, పెషావర్‌లలో 10 కిలోల పిండిని కిలో రూ. 1500 చొప్పున విక్రయిస్తున్నారు. క్వెట్టాలో 20 కేజీల పిండిని రూ. 2,800కు విక్రయిస్తున్నారు.