శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలపై తీవ్రమైన ప్రభావం వేస్తున్నది. విదేశీ మారక నిల్వలు కరిగిపోయి.. ఇంధనాన్ని దిగుమతి చేసుకోలేని స్థితికి శ్రీలంక చేరుకుంది. ఫలితంగా రోజులో 13 గంటలపాటు విద్యుత్‌పై కోత పెడుతున్నది. అంతేకాదు, దేశవ్యాప్తంగా రాత్రిపూట్ స్ట్రీట్ లైట్స్‌నూ ఆఫ్ చేస్తున్నది. 

న్యూఢిల్లీ: శ్రీలంక (Srilanka) ఘోర ఆర్థిక సంక్షోభాన్ని (Economic Crisis) ఎదుర్కొంటున్నది. దాని విదేశీ మారక నిల్వలు (Foreign Reserves) కరిగిపోవడంతో దశాబ్ద కాలంలోనే అత్యంత కఠిన సమయాలను ఫేస్ చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా ఇంధనం లేక కొట్టుమిట్టాడుతున్నది. మళ్లీ వర్షాలు పడే వరకు పరిస్థితులు మారేలా లేవని తెలుస్తున్నది. విదేశీ మారక నిల్వలు లేక విదేశాల నుంచి చమురు దిగుమతి చేయలేకపోతున్నది. తద్వార రోజుకు 13 గంటల పాటు విద్యుత్‌కు కోత (Power Cuts) పెట్టాల్సి వస్తున్నది. అంతేకాదు, రాత్రిపూట కూడా వీధి దీపాలు (స్ట్రీట్ లైట్స్) ను ఆర్పేస్తున్నారు.

విద్యుత్‌ను ఆదా చేయడానికి దేశవ్యాప్తంగా స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు చేసినట్టు పవర్ మినిస్టర్ పవిత్ర వాన్నియారచ్చి రిపోర్టర్లకు వెల్లడించారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు లేక, ధరలు ఆకాశాలను తాకుతున్న తరుణంలో విద్యుత్ కోతలు సామాన్యుడికి అదనపు భారాన్ని మోపుతున్నాయి.

గతేడాది కూడా మార్చిలో రిటేల్ లోటు మార్చిలోనే 18.7 శాతాన్ని తాకిందని గణాంకాల శాఖ గురువారం వెల్లడించింది. కాగా, ఆహార లోటు మార్చి నెలలో 30.2 శాతానికి చేరిందని వివరించింది. గతేడాది రసాయన ఎరువులపై విధించిన నిషేధం, పడిపోతున్న కరెన్సీ విలువ వంటి కారణాలతో ఆహార లోటు ఊహించని స్థితికి చేరిందని విశ్లేషిస్తున్నారు.

గత దశాబ్ద కాలంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఘోర సంక్షోభాన్ని దీన్ని వర్ణిస్తున్నారు. అయితే, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సహకరించాల్సిందిగా ఆ దేశం భారత్, చైనాలను వేడుకుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం.. శ్రీలంకకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. సుమారు 500 అమెరికన్ డాలర్ల విలువైన డీజిల్‌ను క్రెడిట్ లైన్ కింద శ్రీలంకకు షిప్‌మెంట్ చేయడానికి సిద్ధం అయింది. శనివారం ఈ షిప్‌మెంట్ జరగవచ్చు. అయితే, ఈ సహాయం కూడా శ్రీలంక సంక్షోభాన్ని పూడ్చలేదని మంత్రి
వాన్నియారచ్చి వివరించారు. 

భారత్ నుంచి ఆ చమురు వస్తే.. విద్యుత్ పై విధించిన కోతలు కొంత మేరకు తగ్గవచ్చని తెలిపారు. ఈ పరిస్థితులు మళ్లీ వర్షాలు కొట్టే వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. వర్షాల కోసం ఎదురుచూడటం తప్ప ప్రస్తుతం తమ దగ్గర మరో అవకాశం లేదని వివరించారు. అంటే మే నెల వరకు విద్యుత్ పై కోతలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు నీటిని అందించే రిజర్వాయర్లలు నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. దీనికి తోడు వేసవి ముంచుకొస్తుండటం, వాతావరణంలో వేడి పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ కూడా అమాంతం పెరిగిందని మంత్రి వివరించారు. ఆ రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి చేరితే విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో కనీసం పేపర్‌, ఇంక్‌ను కూడా దిగుమతి చేసుకోలేక బడుల్లో పరీక్షలను రద్దు చేసింది. పేపర్‌ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు. దీంతో లక్షలాది మంది పాఠశాల విద్యార్థులకు శ్రీలంక ప్ర‌భుత్వం పరీక్షలను రద్దు చేసింది.