sri lankan PM Mahinda rajapaksa: దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడు చూడని సంక్షోభ పరిస్థితులు, ప్రజా ఆందోళనల మధ్య శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖలను అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు పంపారు.
mahinda rajapaksa steps down as pm: శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడు చూడని సంక్షోభ పరిస్థితలు, ప్రజా ఆందోళనల మధ్య శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖలను అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు పంపారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. మరో వైపు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పదవి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే కుటుంబ పాలకులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఆ దేశ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం మహీందా రాజపక్స ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగడానికి ప్రతిపాదన చేయవచ్చనే వార్తల నేపథ్యంలో.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స కార్యాలయం వెలుపల హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ప్రభుత్వ అనుకూల వర్గాలు నిరసనకారులపై దాడి చేయడంతో పాటు జరిగిన హింసాకాండలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి రాజధానిలో సైన్యాన్ని మోహరించింది.
పౌరులు సంయమనం పాటించాలని మహీందా రాజపక్సే ట్విట్టర్‌లో కోరారు. "మన సాధారణ ప్రజలను సంయమనం పాటించాలని మరియు హింస హింసను మాత్రమే కలిగిస్తుందని గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. మనం ఉన్న ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక పరిష్కారం అవసరం, ఈ పరిపాలన పరిష్కరించడానికి కట్టుబడి ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలావుండగా, 22 మిలియన్ల జనాభా ఉన్నశ్రీలంక లోని ప్రజలు చాలా నెలలుగా బ్లాక్‌అవుట్‌లు మరియు ఆహారం, ఇంధనం, మందుల కొరతతో పోరాడుతున్నారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత దారుణ పరస్థితులు ఇవే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి శ్రీలంక ఎమర్జెన్సీలోకి వెళ్లింది. భారీ ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తి అధికారాలు అప్పగించారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు వెల్లువెత్తడంతో ఐదు వారాల్లో దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం రెండోసారి. దేశ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు రాజపక్సే తన వ్యక్తిగత నివాసం వెలుపల భారీ నిరసనల తర్వాత ఏప్రిల్ 1న కూడా అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. ఆ తర్వాత ఎమర్జెన్సీని ఏప్రిల్ 5న ఉపసంహరించుకున్నారు.
