శ్రీలంక పార్లమెంట్ శనివారం రోజున సమావేశం కానుంది. నేటి సమావేశంలో తదుపరి అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి చర్చించనుంది. గత కొంతకాలంగా శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
శ్రీలంక పార్లమెంట్ శనివారం రోజున సమావేశం కానుంది. నేటి సమావేశంలో తదుపరి అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి చర్చించనుంది. గత కొంతకాలంగా శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. అయినప్పటికీ నిరసనకారులు శాంతించలేదు. ఎట్టకేలకు సింగపూర్ చేరుకున్న గోటయ రాజపక్స.. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గోటబయ ఈమెయిల్ ద్వారా రాజీనామా పంపారని.. దానిని ఆమోదించినట్టుగా పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన శుక్రవారం వెల్లడించారు.
ఈ క్రమంలోనే తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈసారి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడి ఎన్నిక సాగనుంది. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నిక ద్వారా శ్రీలంక అధ్యక్షుడి ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం పార్లమెంట్ సభ్యుల ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నెల 20వ తేదీన అధ్యక్షుడి ఎన్నిక జరపాలని నిర్ణయించారు. 225 మంది సభ్యులున్న పార్లమెంటు.. కొత్త అధ్యక్షుడిని జూలై 20న రహస్య ఓటు ద్వారా ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహింద యాపా అబేవర్దన శుక్రవారం తెలిపారు.
అయితే 1978 నుండి ప్రెసిడెన్సీ చరిత్రలో ఎన్నడూ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్లమెంటు ఓటు వేయలేదు. ఇక, కొత్త అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మిగిలిన పదవీకాలం పూర్తయ్యే వరకు అంటే.. 2024 నవంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. శుక్రవారం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా విక్రమ సింఘే.. ‘రాజ్యాంగాన్ని రక్షించడానికి నేను కట్టుబడి ఉన్నాను’’ అని అన్నారు. అదే సమయంలో అధ్యక్షుడి అధికారాలు తగ్గించబడుతున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చే చర్యలను కూడా ప్రకటించారు. అధ్యక్షుడి కంటే పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పించే 19వ రాజ్యాంగ సవరణను పునరుద్దరిస్తామని తెలిపారు.
అధ్యక్ష పదవి ఖాళీ విషయాన్ని నేడు పార్లమెంట్‌కు అధికారికంగా తెలియజేయనున్నారు. ఈ నెల 19న అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. మరుసటి రోజు అధ్యక్ష ఎన్నిక జరగనుంది.
అయితే అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం శ్రీలంకను దివాళా తీసింది. కనీసం ఆహారం, మందులు, ఇంధనం దొరక్క అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో రాజపక్స కుటంబం కారణంగానే దేశ పరిస్థితి ఇలా తయారైందని శ్రీలంకలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగాయి. అయితే గత కొన్ని నెలలుగా శ్రీలంకలో జరిగిన ముఖ్యమైన పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే..
2022 మార్చి 31: అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితులపై నిరసనగా ప్రదర్శనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రైవేట్ నివాసానికి మార్చ్ చేశారు.
ఏప్రిల్ 3: గోటబయ రాజపక్స క్యాబినెట్‌ను రద్దు చేశారు. ఈ కేబినెట్‌లో అతని తమ్ముడు బాసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే మరో సోదరుడు మహింద రాజపక్స ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
ఏప్రిల్ 9: రాజకీయ సంస్కరణలకు మార్గం సుగమం చేయడానికి అధ్యక్షుడిని తొలగించాలనే డిమాండ్‌తో గోటబయ కార్యాలయం వెలుపల నిరసనలు ఉధృతం అయ్యాయి.
మే 9: ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నిరసనకారుల మధ్య విస్తృతమైన ఘర్షణల తరువాత.. ప్రధాన మంత్రి మహింద రాజపక్స రాజీనామా చేశారు. దేశవ్యాప్త హింసలో తొమ్మిది మంది మరణించారు. సుమారు 300 మంది గాయపడ్డారు.
మే 10: రక్షణ మంత్రిత్వ శాఖ షూట్ ఆన్ సైట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే నిరసనకారులు కర్ఫ్యూను ధిక్కరించారు.
జూన్ 27: ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్నందున అవసరమైన సేవలు మినహా ఇంధన విక్రయాలు నిలిపివేయబడ్డాయి.
జూలై 9: వందలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. గోటబయ రాజపక్స ఇంటికి పారిపోయారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటికి నిప్పు పెట్టారు. ఇద్దరూ పదవీ విరమణ చేసే వరకు కీలకమైన ప్రభుత్వ భవనాలను ఆక్రమిస్తామని నిరసనకారులు ప్రకటించారు. అధ్యక్ష నివాసం వద్ద పౌరులు.. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న, కిచెన్‌లో ఆహార పదార్థాలు తింటున్న, వ్యాయామశాలను ఉపయోగిస్తున్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
జూలై 9: జులై 13వ తేదీన తాను పదవికి రాజీనామా చేయబోతున్నట్లు అధ్యక్షుడు గోటబయ రాజపక్స పార్లమెంటరీ స్పీకర్‌కు తెలియజేశారు. తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు.
జూలై 12: గోటబయ సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు, ప్రయాణికులు అడ్డుకున్నారు.
జూలై 13: గోటబయ రాజపక్స, అతని భార్య, వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయాడు. నిరసనకారులు ఆగ్రహంతో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముట్టడించి ఇద్దరు నేతల రాజీనామాలను డిమాండ్ చేశారు.
జూలై 14: గోటబయ సింగపూర్‌కు వెళ్లి అక్కడ నుండి అధ్యక్ష పదవికి రాజీనామా మెయిల్ పంపారు.
జూలై 15: రాజపక్స రాజీనామా అధికారికంగా ఆమోదించబడిందని.. వచ్చే వారంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని స్పీకర్ మహింద యాపా అబేవర్దన ప్రకటించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు.
