శ్రీలంక లోకల్ ఎలక్షన్స్ కోసం బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయడానికి డబ్బుల్లేవని అక్కడి ప్రభుత్వం చెప్పింది. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు డబ్బుల్లేని కారణంగా వాయిదా వేయాలనే ఆలోచనల్లో అక్కడి ప్రభుత్వం ఉన్నది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం సాకుతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని ఆరోపణలు చేశాయి. 

న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం కారణంగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా అక్కడి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స్ దేశం దాటగా.. రానిల్ విక్రమ్‌సింగేను పార్లమెంటు ఎన్నుకుంది. రానిల్ విక్రమ్‌సింగే ప్రజలు ఎన్నుకున్న నేత కాదు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ దారుణ ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ ఎన్నికలు రానిల్ విక్రమ్ సింగేపట్ల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తేలుస్తాయని అందరూ ఎదురుచూశారు. కానీ, శ్రీలంక నుంచి మరో సంచలన వార్త వస్తున్నది.

ఈ ఎన్నికలు జరపడానికి శ్రీలంక దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నారు. బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయడానికి ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేదని, అందుకే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వవర్గాలు చెప్పాయి.

రానిల్ విక్రమ్ సింగే తన మద్దతును చూపెట్టుకోవడానికి ఈ ఎన్నిక కీలక పరీక్షను పెడుతున్నది. ఈ ఎలక్షన్స్ మార్చి 9వ తేదీన జరగాలి. కానీ, ఈ ఎన్నిక జరిగేలా లేదని ఎన్నికల కమిషన్ సుప్రరీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషన్ కోర్టుకు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవలే తాము కోర్టుకు తెలిపామని ఈసీ చీఫ్ నిర్మల్ పంచిహెవా వివరించారు. కానీ, ఇప్పుడు ఇది సాధ్యం కావడం లేదని కోర్టుకు చెబుతున్నానని తెలిపారు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఫండ్స్‌ను ప్రభుత్వం విడుదల చేయడం లేదని పేర్కొన్నారు.

ప్రెసిడెంట్ ఇటీవలే ఇందుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు అసాధ్యంగా ఉన్నదని తెలిపారు. జీతాలు, పింఛన్లు, అత్యవసర సేవలు నిర్వహించడం దుస్సాధ్యంగా ఉన్నదని ఆయన అన్నారు. 

Also Read: దావూద్ ఇబ్రహీం డీ కంపెనీపై ఎన్‌ఐఏ టార్గెట్.. దుబాయ్‌కు వెళ్లిన టీమ్

ఎన్నికలను వాయిదా వేయాలనే నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటునూ స్తంభింపజేశాయి. ఆర్థిక సంక్షోభం సాకుతో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే అణచివేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలను తుంగలో తొక్కాలని చూస్తున్నారని, అధికారాన్ని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశాయి.

ఎన్నికలు నిర్వహించాలని అక్కడి టాప్ కోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, కోర్టు తీర్పు ఇచ్చినా.. నిజంగానే వాటి నిర్వహణకు డబ్బులున్నాయా? లేదా? అనే విషయాలు మాత్రం తెలియదు.