Sri Lanka protest: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంధన ధరల తాజా పెంపు ను నిరసిస్తూ నైరుతి ప్రాంతంలోని రంబుక్కన పట్టణంలో నిరసన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 12 మందికి గాయాలయ్యాయ.   

Sri Lanka protest: శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావ‌స‌ర ధరలు ఆకాశాన్ని అట్ట‌డంతో ప్ర‌జా ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలతో అట్టుడుకుతున్నది. రాజధాని కొలంబోలో ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ జరుగుతున్న నిరసనల్లో తొలిసారి హింస చెలరేగింది. ఈ క్ర‌మంలో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కెగల్లె ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అనేక ఆందోళనలు జ‌రిగిన‌.. తొలి మరణం ఇదే. హింసాత్మక ఘటనల తర్వాత పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

 తీవ్రమైన చమురు కొరత, అధిక ధరలను నిరసిస్తూ అనేక మంది నిరసన‌కారులు రాజధాని కొలంబోకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ శ్రీలంకలోని రంబుక్కనలో ఒక రహదారిని దిగ్బంధించారు. ఆగ్రహించిన వేలాది మంది వాహనదారులు టైర్లను తగులబెట్టారు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారిని అడ్డుకున్నారు. అదే స‌మ‌యంలో కొంత‌మంది నిర‌స‌న కారులు రెైల్వే ట్రాక్​ను దిగ్బంధించారు. కొన్ని చోట్ల పట్టాలను తొలగించారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు రాళ్ల దాడి చేశారు.

ఈ సందర్భంగా నిర‌స‌న కారుల‌కు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. వెళ్లిపోవాలని కోరినా ఆందోళనకారులు వినలేదని, బలగాలపై రాళ్లు రువ్వారని పోలీసులు పేర్కొన్నారు. ఆయిల్‌ ట్యాంకర్‌, మరో వెహికిల్‌కు నిప్పంటించేందుకు యత్నించారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మొదట టియర్‌గ్యాస్‌, తర్వాత కాల్పులు జరిపామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అలాగే.. రంబుక్కన పోలీస్ డివిజన్‌లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ ప‌రిస్థితిపై శ్రీలంకలోని అమెరికా రాయబారి జూలీ చుంగ్ ద్వీప దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు." రంబుక్కన నుండి వెలువడుతున్న భయానక వార్తలకు నేను చాలా బాధపడ్డాను. నిరసనకారులు లేదా పోలీసులపై ఏదైనా హింసను ఖండిస్తున్నాను. అన్ని వైపుల నుండి సంయమనం, ప్రశాంతత కోసం పిలుపునిస్తున్నాను. పూర్తి, పారదర్శక విచారణ అవసరం, శాంతియుత నిరసనకు ప్రజల హక్కు ఉండాలి. సమర్థించబడాలి" అని ఆమె ట్వీట్ చేసింది.

ట్రిపుల్‌ సెంచరీ దాటిన పెట్రోల్‌ ధర

శ్రీలంకలో ఇంధన ధరలూ భగ్గుమంటున్నాయి. ఈ స‌మ‌యంలో పెట్రోల్‌ ధర ట్రిపుల్‌ సెంచరీ దాటింది. ప్ర‌స్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.338కు చేరింది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ) పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) కూడా సోమవారం అర్ధరాత్రి ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధరను రూ.84 మేర పెంచేయడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.338కి చేరింది.ఇక డీజిల్‌పై 64.2 శాతం పెంచగా, ప్రస్తుత ధర రూ.289కు చేరింది. గత ఆరు నెలల కాలంలో శ్రీలంకలో ఎల్‌ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా.. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు తాజాగా పెంచిన ధరలు మరింత ఆగ్రహానికి గురిచేశాయి.