శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీమానకు డేట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దేశ నూతన అధ్యక్షుడిని ఈ నెల 20వ తేదీన దేశ పార్లమెంటు ఎన్నుకుంటుందని స్పీకర్ వెల్లడించారు. 

న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ, అజ్ఞాతంలో నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేయడానికి రెడీ ఉన్నట్టు గొటబాయ రాజపక్స స్పీకర్ మహింద యాప అబేయవర్దనేకు తెలిపారు. పార్టీ నేతల విజ్ఞప్తులను స్వీకరించి తాను ఈ నెల 13వ తేదీన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై స్పీకర్ బిజీ అయ్యారు.

గొటబాయ రాజపక్స తర్వాత కొత్త అధ్యక్షుడి కోసం ఈ నెల 20వ తేదీన పార్లమెంటులో ఎన్నిక జరుగుతుందని స్పీకర్ మజహింద యాప అబేయవర్దనే తెలిపారు. సోమవారం జరిగిన కీలకమైన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గొటబాయ రాజపక్స ఇప్పటికి ఇంకా రాజీనామా చేయాల్సి ఉన్నది. కానీ, 13వ తేదీన రాజీనామా చేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రధాని రానిల్ విక్రమ్ సింఘే కూడా రాజీనామాకు రెడీ అన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పీఎంగానే కొనసాగుతానని పేర్కొన్నారు.

గొటబాయ రాజపక్స రాజీనామా మాటలు విన్న తర్వాత జులై 15వ తేదీన పార్లమెంటు సమావేశం జరుగుతుంది. అందులో దేశ అధ్యక్షుడి పోస్టు వెకెంట్‌గా ఉన్నదని ప్రకటిస్తారు. ఆ తర్వాత 19వ తేదీన మరోసారి పార్లమెంటు సమావేశం నిర్వహించి అధ్యక్ష పదవికి చట్టసభ్యుల నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఆ తర్వాత 20వ తేదీన పార్లమెంటు సభ్యులు పార్లమెంటరీ బ్యాలెట్‌తో ఓటు వేయాల్సి ఉంటుంది.

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, అధ్యక్ష, ప్రధాని రాజీనామా చేస్తే.. స్పీకర్ 30 రోజుల పాటు యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. ఈ కాలంలోనే పార్లమంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. గొటబాయ రాజపక్సకు సంబంధించిన మిగిలిన రెండేళ్ల పదవీ కాలాన్ని కొత్త అధ్యక్షుడు తీరుస్తారు.