Sri Lanka Economic Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపు దాల్చింది. నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వల్ల దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. క్రమంగా దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తుండడంతో శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా 36 గంటల లాక్ డౌన్ ప్రకటించింది.
Sri Lanka Economic Crisis: శ్రీలంకలో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం తీవ్రరూపు దాల్చుతోంది. నిత్యావసర సౌకర్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుకుంది. శ్రీలంక ప్రజలు అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ తీరును సామాన్యులు నిరసన దాడులకు దిగుతున్నారు. క్రమంగా దేశంలో అరాచకాలు చెలరేగడంతో శ్రీలంక ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో దేశంలో 36 గంటల లాక్ డౌన్ ప్రకటించింది.
శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కర్ఫ్యూ విధించినట్టు తెలుస్తోంది.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఎమర్జెన్సీని ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ చర్య అమల్లోకి వచ్చింది. కాగా, ప్రభుత్వ అసమర్థ విధానాలు, అనాలోచిత పన్ను రాయితీలు, కరోనా సంక్షోభంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర భారం పడిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా...పెట్రోలు, డీజిల్, ఆహారం, మందుల కొరత కారణం వల్ల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం.. దేశాధ్యక్షుడు రాజపక్స నివాసంలోకి చొరబడేందుకు కూడా కొందరు నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ప్యూ విధించినట్టు తెలుస్తుంది. "ప్రజా భద్రత, శాంతి భద్రతలు, సమాజ జీవితానికి అవసరమైన సామాగ్రి, సేవల నిర్వహణ" ప్రయోజనాల దృష్ట్యా ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చినట్టు రాష్ట్రపతి తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం ఎలా ఉండంటే.. కర్ఫ్యూ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు.. కొలంబోలోని నేలమ్ పోకున (లోటస్ పాండ్) - మహింద రాజపక్సే థియేటర్ సమీపంలో వేలాది మంది పౌరులు గుమిగూడారు. దేశ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ “గోటా గో హోమ్” , “కుటుంబ పాలనను అంతం చేయాలి ” అంటూ పోస్టర్లు పట్టుకుని నిరసనలు తెలిపారు. దీంతో నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తల్లెత్తింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి.
మానవ హక్కుల కార్యకర్త, మాజీ ప్రతిపక్ష నేత హిరునిక ప్రేమచంద్ర పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకుని ఘన అక్క అనే మత పెద్ద నివాసంపై దాడికి వెళ్ళారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోగలిగారు. మత పెద్దలకు పోలీసులు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని పోలీసులను నిలదీశారు. ‘‘దొంగ, దొంగ, గొటా దొంగ’’ అంటూ ఆమెతోపాటు వచ్చిన మహిళలు నినాదాలు చేశారు. #GoHomeRajapaksas, #GotaGoHome హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఎమర్జెన్సీ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీనియర్ న్యాయవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితికి ఈ నిర్ణయం సరైన సమాధానం కాదని, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయని శ్రీలంక బార్ అసోసియేషన్ తెలిపింది. కొనసాగుతున్న నిరసనలు కొన్ని ప్రాథమిక అవసరాలను కోరుకునే ప్రజల "తీవ్రమైన పరిస్థితిని" ప్రతిబింబిస్తాయి, "శాంతియుత నిరసనలు మరియు అసమ్మతిని అణిచివేసేందుకు లేదా ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలను చేయడానికి అత్యవసర పరిస్థితిని ఉపయోగించకూడదు" అని పేర్కొంది.
ప్రతిపక్ష ఎంపీ, ప్రముఖ న్యాయవాది M.A. సుమంతిరన్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు: “ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని # రాష్ట్రపతి @GotabayaRని మేము కోరుతున్నాము. #అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ద్వారా మీరు నిరసనలు, పాలనపై వ్యతిరేకతను అణచివేయలేరు. ఈ అనాలోచిత చర్యను ఆమోదించవద్దని #పార్లమెంట్‌లోని తోటి సభ్యులకు నేను పిలుపునిస్తున్నానని అన్నారు.
అధ్యక్షుడు, అతని ప్రభుత్వం పదవీ విరమణ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక పౌరులు ఒక నెలకు పైగా నిరసనలు చేస్తున్నారు. సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆహార పదార్థాలు కొరత, ఇంధనంతో సహా నిత్యావసరాల కొరత కారణంగా ప్రజలు ఆగ్రహనికి లోనవుతున్నారు. ఇంధన దిగుమతుల కోసం 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌తో సహా భారతదేశం అత్యవసర సహాయాన్ని అందిస్తోంది. శనివారం, భారతదేశం నుండి 40,000 MT డీజిల్ సరుకును శ్రీలంక అధికారులకు అందజేశారు. ఈ క్రెడిట్ లైన్‌లో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి ఇప్పటివరకు దాదాపు 2 లక్షల MT ఇంధనం శ్రీలంకకు చేరుకుంది.
