Sri Lanka crisis-violence: ఆందోళనలు ఉధృతం కావడంతో శ్రీలంక మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుటుంబాన్ని హెలికాప్టర్‌లో నౌకాదళ స్థావరానికి తరలించినట్లు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు పేర్కొన్నారు.
Sri Lanka Ex-PM, Family Flee To Naval Base: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ప్రధాని పదవికి మహీందా రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత దేశంలో ఆందోళన కారులు రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న ఘర్షణలో వందల మంది గాయపడ్డారు. ఐదుగురు చనిపోయారు. ఇంతటితో ఆగని నిరసనకారులు.. రాజపక్సే కుటుంబానికి చెందిన ఆస్తులకు నిప్పుపెట్టారు. పరిస్థితి మరింత దారుణంగా మారుతుండటంతో ఓ నౌకాశ్రయంలో మాజీ ప్రధాని మహీందా రాజపక్సే సహా ఆయన కుటుంబం తలదాచుకుంది. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం.. త్రికోణమలైలో ఉన్న నావల్ బేస్‌లో ప్రస్తుతం మహీందా రాజపక్సే, ఆయన కుటుంబం ఆశ్రయం పొందుతన్నట్లు సమాచారం. రాజధాని కొలంబోకు సుమారు 270 కిలోమీటర్ల దూరంలో త్రికోణమలై నావల్ బేస్ ఉంది. విషయం తెలుసుకున్న ఆందోళనకారులు.. అక్కడ కూడా ప్రదర్శన చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఫ్యామిలీతో కలిసి మాజీ ప్రధాని రాజపక్స నౌకాశ్రయానికి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇదిలావుండగా, శ్రీలంక ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మహీందా రాజపక్సే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. అంతర్యుద్ధ పరిస్థితులకు దారితీసిన అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొంటోంది. సోమవారం ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడితో ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేసినప్పటికీ హింస అంతమయ్యేలా కనిపించడం లేదు. రాజపక్సే కుటుంబానికి మద్దతుదారులు మరియు ప్రత్యర్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 225 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఇంకా అనేక చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య జరిగిన హింసాకాండలో అధికార పార్టీ ఎంపీ సహా ఇప్పటి వరకు 5 మంది చనిపోయారు. ఆర్థిక సంక్షోభం శ్రీలంకను తాకినప్పటి నుండి అతిపెద్ద ఘర్షణలు సోమవారం ఉదయం రాజపక్స కుటుంబ మద్దతుదారులు విధ్వంసానికి దిగడంతో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అనుకూల వర్గాలు ఏప్రిల్ 9 నుండి డౌన్‌టౌన్ కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరాయుధ నిరసనకారులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన నిరసనకారులు.. బస్సులకు నిప్పంటించారు, అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు అతని సోదరుడు మహింద రాజపక్స తల్లిదండ్రుల కోసం నిర్మించిన స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేశారు.. కొలంబో నుండి 250 కిమీ దూరంలో ఉన్న హంబన్‌టోటాలోని వారి కుటుంబ ఇంటికి నిప్పు పెట్టారు . ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు ఎంపీల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు.
ప్రభుత్వ అనుకూల నిరసనకారులు గాల్ ఫేస్‌లో నిరసన తెలుపుతున్న ప్రజల టెంట్లను పడగొట్టడం ప్రారంభించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మద్దతుదారులు ఆందోళనకారులపై దాడి చేయడంతో ప్రతిఘటన ప్రారంభమైంది. కొలంబోలో జరిగిన ఈ ఘర్షణలో 225 మంది గాయపడ్డారు. వీరిని కొలంబో జాతీయ ఆసుపత్రిలో చేర్పించారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించారు. ప్రెసిడెంట్ గోటబయ మరియు మాజీ ప్రధాని మహీందా ఇద్దరూ ట్విట్టర్‌లో హింసను ఖండించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
