Mahinda Rajapaksa: శ్రీలంక ఆర్థిక సంక్షోభం, ప్రజా ఆందోళనల నేపథ్యంలో సోమవారం తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ దేశ మాజీ ప్రధాని మహీందా రాజపక్సే కనిపించడం లేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారనే దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
Sri Lanka economic crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నశ్రీలంకలో.. ప్రధాని పదవికి మహీందా రాజపక్సే సోమవారం రాజీనామా చేశారు. అప్పటి నుంచి శ్రీలంక రగిలిపోతోంది. రాజపక్సే కు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రజలు ధ్వసం చేస్తూ.. నిప్పుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధానిగా రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచి రాజపక్సే, ఆయన కుటుంబంతో సహా దేశం విడిచిపారిపోయారనే వార్తలు వచ్చాయి. మహీందా రాజపక్సే సహా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భారత్ పారిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రీలంకలోని భారత హైకమిషన్.. రాజపక్సే కుటుంబం భారత్ కు పారిపోయిందనే వార్తలపై స్పందించింది. భారతదేశానికి పారిపోయాడని స్థానిక సోషల్ మీడియా ఊహాగానాలను నకిలీ మరియు కఠోరమైన అబద్దాలంటూ కొట్టిపారేసింది.
"కొందరు రాజకీయ వ్యక్తులు మరియు వారి కుటుంబాలు భారతదేశానికి పారిపోయారని మీడియా మరియు సోషల్ మీడియా విభాగాలలో పుకార్లు వ్యాపించడాన్ని హైకమిషన్ ఇటీవల గమనించింది. ఇవి నకిలీ మరియు కఠోరమైన తప్పుడు నివేదికలు.. ఇందులో ఎటువంటి నిజం లేదు.. భారత హైకమిషన్ వాటిని తీవ్రంగా ఖండించింది" అని ఒక ప్రకటన తెలిపింది. శ్రీలంక స్వతంత్య్రం పొందినప్పటి నుంచి ఎప్పుడు చూడని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి ఆ దేశ మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుటుంబ రాజకీయ నాయకులే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే, ప్రజలు సైతం వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు దిగారు.
ఆందోళనలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న వేళ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం నాడు మహీందా రాజపక్సే ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా రాజీనామా లేఖలను అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు అందించారు. మహీందా రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వ అనుకూల మద్దతు దారులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో చనిపోయారని వందల మంది గాయపడ్డారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఘర్షణల అనంతరం నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను హోరెత్తించారు. ఈ క్రమంలోనే అధికార పార్టీలోని మంత్రులకు చెందిన ఆస్తులతో పాటు రాజపక్సే కుటుంబానికి చెందిన ఆస్తులకు నిప్పుపెట్టారు. పరిస్థితి మరింతగా దిగజారడంతో అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఆర్మీకి సూపర్ పవర్స్ ను ఇచ్చారు. ఆందోళనకారులు కనిపిస్తే.. కాల్చివేసే ఆర్డర్స్ ను జారీ చేశారు.
