Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక సమూహాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 138 మంది గాయపడ్డారు.
SriLanka crisis-violence: శ్రీలంక ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మహీందా రాజపక్సే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. అంతర్యుద్ధ పరిస్థితులకు దారితీసిన అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొంటోంది. సోమవారం ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడితో ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేసినప్పటికీ హింస అంతమయ్యేలా కనిపించడం లేదు. రాజపక్సే కుటుంబానికి మద్దతుదారులు మరియు ప్రత్యర్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 138 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఇంకా అనేక చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య జరిగిన హింసాకాండలో అధికార పార్టీ ఎంపీ సహా ఇప్పటి వరకు 5 మంది చనిపోయారు. ఆర్థిక సంక్షోభం శ్రీలంకను తాకినప్పటి నుండి అతిపెద్ద ఘర్షణలు సోమవారం ఉదయం రాజపక్స కుటుంబ మద్దతుదారులు విధ్వంసానికి దిగడంతో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అనుకూల వర్గాలు ఏప్రిల్ 9 నుండి డౌన్‌టౌన్ కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరాయుధ నిరసనకారులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన నిరసనకారులు.. బస్సులకు నిప్పంటించారు, అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు అతని సోదరుడు మహింద రాజపక్స తల్లిదండ్రుల కోసం నిర్మించిన స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేశారు.. కొలంబో నుండి 250 కిమీ దూరంలో ఉన్న హంబన్‌టోటాలోని వారి కుటుంబ ఇంటికి నిప్పు పెట్టారు . ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు ఎంపీల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు.
ప్రభుత్వ అనుకూల నిరసనకారులు గాల్ ఫేస్‌లో నిరసన తెలుపుతున్న ప్రజల టెంట్లను పడగొట్టడం ప్రారంభించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మద్దతుదారులు ఆందోళనకారులపై దాడి చేయడంతో ప్రతిఘటన ప్రారంభమైంది. కొలంబోలో జరిగిన ఈ ఘర్షణలో 138 మంది గాయపడ్డారు. వీరిని కొలంబో జాతీయ ఆసుపత్రిలో చేర్పించారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించారు. ప్రెసిడెంట్ గోటబయ మరియు మాజీ ప్రధాని మహీందా ఇద్దరూ ట్విట్టర్‌లో హింసను ఖండించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా, శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడు చూడని సంక్షోభ పరిస్థితలు, ప్రజా ఆందోళనల మధ్య శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖలను అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు పంపారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. మరో వైపు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పదవి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
