గత కొన్ని వారాలుగా ద్వీప దేశం శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆహారం, ఇంధనాల తీవ్రమైన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
గత కొన్ని వారాలుగా ద్వీప దేశం శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సాధించినప్పటీ నుంచి ఎప్పుడూ లేని విధంగా అత్యంత ఘోరమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. ఆహారం, ఇంధనాల తీవ్రమైన కొరతతో, విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు నిరసనలు తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశ ఖాజానా దివాళా తీసినట్టుగా వెల్లడించింది. విదేశీ అప్పులను చెల్లించలేమని తెలిపింది. దిగుమతుల కోసం విదేశీ మారకం అయిపోయిన తర్వాత విదేశీ రుణ మొత్తం 51 బిలియన్ డాలర్లను డిఫాల్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యను చివరి ప్రయత్నంగా శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదలు చేసింది. విదేశీ ప్రభుత్వాలతో సహా రుణదాతలు మంగళవారం నుంచి తమకు చెల్లించాల్సిన ఏవైనా వడ్డీ చెల్లింపులను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయల్లో చెల్లింపును ఎంచుకోవచ్చని తెలిపింది. దేశ ఆర్థిక స్థితి మరింత దిగజారకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ అత్యవసర చర్యను చివరి ప్రయత్నంగా మాత్రమే తీసుకుంటుందని ప్రకటనలో పేర్కొంది.
ఇక, సోమవారం రోజున జాతినుద్దేశించి ప్రసంగించిన శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స.. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రభుత్వం శతవిధాలుగా కృషి చేస్తుందని చెప్పారు. ఇందు కోసం.. ప్రజలు ఓపికగా ఉండాలని ప్రజలను అభ్యర్థించారు. వీధుల్లో నిరసనల వల్ల నగదు కొరత ఎదుర్కొంటున్న మన దేశానికి ఆర్థిక సాయం అందకుండా పోతోందని మహింద రాజపక్స అన్నారు.
లిబరేషన్ టైగర్స్ ఫర్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడిన శ్రీలంక యుద్ధ వీరులను నిరసనకారులు అవమానిస్తున్నారని, దేశంలోని యువత అవమానాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారని రాజపక్సే ఆరోపించారు. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటాయనీ, ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధ్యక్షుడితో కలిసి అను క్షణం పనిచేస్తున్నామని అని మహింద రాజపక్స పేర్కొన్నారు.
ప్రతిపక్షాలను ఉద్దేశించి రాజపక్సే మాట్లాడుతూ.. "దేశంలో ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరినప్పటికీ, ఎవరూ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం కాబోదని, సంక్షోభ పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
