శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలారు. ఆయన తన భార్యతో కలిసి అంటొనోవ్ 32 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో మాల్దీవులకు బయల్దేరి వెళ్లిపోయారు. మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఆ మిలిటరీ విమానం వెళ్లినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. త్వరలోనే ఆయన రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు దేశం వీడారు. గొటబాయ రాజపక్స రాజీనామాకు ఇది ముందు చర్యగా చూస్తున్నారు. త్వరలోనే రాజీనామా ప్రకటించే అవకాశం ఉన్నది. బుధవారం తాను అధ్యక్షుడిగా రాజీనామా చేస్తానని గొటబాయ రాజపక్స గతవారం చివరిలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన రాజీనామా ద్వారా శాంతియుతంగా నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని పేర్కొన్నారు.
ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న ఆర్థిక సంక్షోభం మూలంగా వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవలే వారంతా దేశ రాజధానికి చేరి అధ్యక్షుడు, ప్రధాన మంత్రుల అధికారిక భవనాలను ముట్టడించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధికారిక భవనాన్ని నిరసనకారులు చుట్టుముట్టడానికి కొంత ముందు ఆయన పారిపోయారు. ఆ తర్వాత తన ఆచూకి కనిపించలేదు.
గతవారం ఆయన తన రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, అధ్యక్షుడిగా తనను అరెస్టు చేసే అధికారం ఎవరికీ ఉండదు. కాబట్టి, తాను అధ్యక్షుడిగానే దేశం వదిలి వెళ్లిపోవాలని బహుశా ఆయన నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తున్నది.
గొటబాయ రాజపక్స, ఆయన సతీమణి, ఓ బాడీగార్డు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో మాల్దీవులకు ప్రయాణం కట్టారు. అంటొనోవ్ 32 మిలిటిరీ విమానంలో వారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఆ విమానం మాల్దీవులకు బయల్దేరినట్టు ఇమ్మిగ్రేషన్ వర్గాలు వివరించాయి.
వారి పాస్‌పోర్టులపై స్టాప్ వేశాారని, ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌లో వారు వెళ్లిపోయారని ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ఒకప్పుడు ది టెర్మినేటర్‌గా పేరు సంపాదించుకున్న 73 ఏళ్ల గొటబాయ రాజపక్స ఎయిర్ పోర్టు అధికారులతో 24 గంటలపాటు గొడవ పడినట్టు తెలిసింది.
ఆయన నిజానికి కమర్షియల్ ఫ్లైట్‌లో దుబాయ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కానీ, బండారునాయికే అంతర్జాతీయ విమానాశ్రయంలో వీఐపీ సేవలు రద్దు చేశారు. ఈ కారణంగా అధ్యక్షుడికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయలేదు. మిగితా ప్రయాణికులతో కలిసి వెళ్లిపోవాలని అధికారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు తెలిపారు.
కానీ, ప్రజల నుంచి ఎలాంటి స్పందన అయినా రావొచ్చని, సాధారణ ప్రయాణికులతో కలిసి విమానంలో ప్రయాణించడానికి ఆయన వెనుకాముందు ఆడారు. ఈ కారణంగా తక్కువ మందితో దుబాయ్‌కి వెళ్లే విమానాల కోసం సోమవారం అంతా ఎదురు చూశారు. కానీ, అలా కనిపించక.. సోమవారం నాలుగు విమానాలు యూఏఈ వెళ్లుతున్నా చూస్తూ ఉండిపోయారని సమాచారం. కాగా, భారత్‌కు రావడానికి ఆయనకు వెంటనే మిలిటరీ ఫ్లైట్ క్లియరెన్స్ దొరకలేదు. దీంతో ఎలాగైనా ముందు దేశం వదలాలని భావించి మాల్దీవులకు చేరారు.
