ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు కొరియా దేశాల మధ్య ఉందన్నది వాస్తవం.. అణు, ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తూ.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగేలా వ్యవహరించిన ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మనసు మార్చుకుని విశ్వశాంతి కోసం అణు నిరాయుధీకరణ దిశగా అమెరికాకు స్నేహ హస్తం చాచారు.. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించడంతో ఆ దశాబ్ధంలో అత్యంత ప్రధాన చర్చకు సింగపూర్ వేదికైంది.

ఒకరినొకరు దూషణలకు దిగిన కిమ్, ట్రంప్ ఇద్దరూ చర్చలకు కూర్చుంటారని ఎవ్వరూ కల్లో కూడా ఊహించలేదు.. ఇద్దరి వల్ల మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉంటే మంచిదని ఎంతో మంది ప్రార్థించారు అలాంటిది అమెరికా, ఉత్తరకొరియా అధినేతలు శాంతి వైపు అడుగులు వేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక మీదట కొరియాలో క్షిపణి ప్రయోగాలు ఉండవని.. ఆ దేశం ఇక అభివృద్ధివైపు పయనిస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు.. నార్త్ కొరియా ఇలా ముందుకు వెళుతుంటే.. దక్షిణ కొరియా ప్రజలు ఒక ఉద్యమంతో రోడ్ల మీదకు వస్తున్నారు..

ఆ దేశంలో మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న ‘రహస్య లైంగిక దోపిడి’కి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.. 2010 నుంచి ఆ దేశంలో రహస్య కెమెరాలలో నగ్నంగా చిత్రీకరించబడి సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కి పరువు పొగొట్టుకున్న వారు కోట్లలో ఉన్నారు.. బస్సుల్లో, రైళ్లలో, పబ్లిక్ టాయిలెట్లు, షాపింగ్ మాల్స్, డ్రెస్సింగ్ రూమ్‌లు, ఇలా ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు పెట్టి మహిళల నగ్న దృశ్యాలను పోర్న్‌సైట్‌లలో పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.

ఈ భూతానికి కేవలం మహిళలు, చిన్నారులే కాదు.. మగవారు కూడా బలవుతున్నారు. గత నెలలో ఓ 25 ఏళ్ల యువకుడి నగ్న ఫోటోలను రహస్యంగా చిత్రీకరించిన ఓ యువతి వాటిని సోషల్ మీడియాలోనూ.. పోర్న్‌సైట్లలోనూ పెట్టింది.. ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే... తమ నగ్నదృశ్యాలను ఇలా ఆన్‌లైన్‌లో పెడుతున్నారని ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తుంటే వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై విసిగిపోయిన ప్రజలు సహనం నశించి ఉద్యమ రంగంలోకి దిగారు. గత వారం దాదాపు 20 వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి  ‘స్పై కెమెరా పోర్న్‌’పై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.. రానున్న కాలంలో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. మరి దక్షిణ కొరియా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..