ఆరేళ్ల క్రితం ఎలన్ మస్క్ పై లైంగిక వేధింపుల కేసు, సెటిల్మెంట్ ఇప్పుడు కొత్తగా తెరమీదికి వచ్చాయి. ఈ కేసులో బాధితురాలికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టినట్టు ఇన్‌సైడర్ నివేదిక బయటపెట్టింది.
శాన్ ఫ్రాన్సిస్కో : ప్రపంచకుబేరుడు ఎలన్ మస్క్ పై లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2016లో ఎలన్ మస్క్ లైంగికంగా వేధించారని ఓ స్పేస్‌ఎక్స్ ఉద్యోగి ఆరోపించింది. అయితే ఈ కేసును సెటిల్ చేసుకోవడానికి ఆమెకు స్పైస్ ఎక్స్ $250,000 చెల్లించిందని ఇన్‌సైడర్ నివేదిక తెలుపుతోంది.
రాకెట్ ప్రయోగ సంస్థ, SpaceX కార్పొరేట్ జెట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసిన ఒక గుర్తుతెలియని ఫ్లైట్ అటెండెంట్‌కి 2018లో ఈ మేరకు చెల్లింపులు జరిగాయని ఆన్‌లైన్ న్యూస్ ప్రొవైడర్ ఇంటర్వ్యూలు, పత్రాలను ఉటంకిస్తూ చెప్పారు. వీటిల్లో అటెండర్ స్నేహితుడు సంతకం చేసిన, ఆమె దావాకు మద్దతుగా చేసిన డిక్లరేషన్ లు కూడా ఉన్నాయి.
దీనిమీద ట్విటర్ లో ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు మస్క్ అర్థరాత్రి ఇలా స్పందించాడు. "రికార్డ్ కోసం, ఆ క్రూరమైన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం." ఇదంతా కట్టుకథ అని పూర్తిగా అబద్ధం అని చెప్పుకొచ్చాడు. అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పాడు.
ఇన్‌సైడర్ రిపోర్ట్‌ను నేరుగా ప్రస్తావించని అంతకు ముందటి ట్వీట్‌లో, మస్క్ స్పందిస్తూ.. "నాపై జరిగిన దాడులను రాజకీయ లెన్స్‌తో చూడాలి" అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, అయితే "తన వాక్ స్వాతంత్ర్య హక్కు" కోసం పోరాడకుండా తనను ఏదీ అడ్డుకోలేదని చెప్పాడు.
ట్విట్టర్ ఇంక్ కోసం $44 బిలియన్ బిడ్‌ను ప్రకటించినప్పటి నుండి బిలియనీర్ ఎలన్ మస్క్, దానిని మరింత స్వేచ్ఛా-స్పీచ్ ప్లాట్‌ఫారమ్‌గా చేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు గురువారం తాను డెమొక్రాట్‌లను వదులుకున్నానని, ఇప్పుడు రిపబ్లికన్‌కు ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ కేసులోకి వస్తే.. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎలన్ మస్క్ తనను తాను పరిచయం చేసుకుని.. విమానంలోని ఒక ప్రైవేట్ గదిలో ఆమెకు ప్రపోజ్ చేశాడని..బాదితురాలి స్నేహితుడు తెలిపాడని ఆ నివేదికలో ఉంది. అంతేకాదు తనకు శృంగార మసాజ్‌కు బదులుగా ఆ ఫ్లైట్ అంటెండెంట్ కు గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చారని నివేదిక పేర్కొంది. అయితే, హాథోర్న్, కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ప్రతినిధులు దీనికి సంబంధించి వివరణ కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
