పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. దక్షిణ వజీరిస్థాన్ సరిహద్దులోని లక్కీ మార్వాట్ జిల్లాలో గుర్తుతెలియని ముష్కరులు పోలీసుల వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు.

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో మరణహోమం జరిగింది. బుధవారం నాడు సాయుధ దుండగులు పోలీసు వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ వజీరిస్థాన్ సరిహద్దులోని లక్కీ మార్వాట్ జిల్లాలో గుర్తుతెలియని ముష్కరులు పోలీసులు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పోలీస్ పోస్ట్ ఇలుందీన్‌లోని అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా ఆరుగురు కానిస్టేబుళ్లు మరణించారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పోలీసు అధికారి లక్కీ మార్వాత్ తెలిపారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పాక్ ప్రధాని 

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనను ఖండించారు.అంతర్గత మంత్రి రాణా సనావుల్లా దాడిపై ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ, పోలీసు చీఫ్ నుండి నివేదికను కోరారు. ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ కూడా ఈ సంఘటనను పరిశీలించారు. ఖైబర్ పఖ్తుంక్వా పోలీసు చీఫ్ నుండి తక్షణ నివేదికను కోరారు. గత వారం..దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని రగ్జాయ్ పోలీస్ స్టేషన్‌లో భారీగా సాయుధులైన దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా.. మరో తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు.