బ్రిటన్‌లో పుట్టిన కొత్త రకం స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోవిడ్ విజృంభణతో అతలాకుతలమైన ఆయా దేశాలు.. మళ్లీ కొత్త రకం తమ గడపలోకి రాకుండా వుండేందుకు ముందుస్తు చర్యలు చేపడుతున్నాయి.

ఇప్పటికే అన్ని దేశాలు యూకేకు విమాన ప్రయాణాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వారికి సవాలక్షా కండీషన్లు పెడుతున్నాయి.

తాజాగా ఈ లిస్ట్‌లోకి సింగపూర్ చేరింది. జనవరి 25 నుంచి సింగపూర్‌కు వచ్చే ప్రతి ఒక్కరు కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తమ దేశంలో ఉండే నాన్‌రెసిడెంట్స్‌, పర్యాటకులు మాత్రం ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్‌ చేయించుకోవాలని ఆదేశించింది.

తర్వాత కొన్నాళ్లు ఇంట్లోనే స్వీయ గృహ నిర్బంధంలో వుండి .. తర్వాత సాధారణ ప్రజల్లో కలవడానికి మరోసారి పరీక్ష చేయించుకోవాలని సూచించింది. తాజా నిబంధనల ప్రకారం సింగపూర్‌ ప్రజలు కూడా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

యూకే, సౌత్‌ ఆఫ్రికా వంటి దేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు ఇంట్లో ఉండటంతో పాటు.. మరో ఏడు రోజులు అదనంగా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలి.  దీంతో పాటు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సింగపూర్‌కి రావాలనుకునే వారు రెసిప్రోకల్‌ గ్రీన్‌ లేన్‌ అండ్‌ ఎయిర్‌ ట్రావెల్‌ పాస్‌ ఏర్పాట్ల కింద దరఖాస్తు చేసుకోవాలి.

దీని కింద కరోనా వైరస్‌ చికిత్స కోసం  22,560 డాలర్ల కవరేజి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. కాగా, విదేశాల నుంచి సింగపూర్‌కు వచ్చిన వారిలో 28 మందికి కోవిడ్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది.